దంచికొట్టిన వాన.. డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద

దంచికొట్టిన వాన..   డబుల్ బెడ్రూం ఇండ్లలోకి వరద

వరుసగా మూడోరోజు మంగళవారం కూడా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, వరంగల్ ​జిల్లాల్లో భారీ వర్షాలు పడగా.. నల్గొండ, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జనగామ, జగిత్యాలలో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో 18 సెంటీమీటర్లు, మెదక్​ జిల్లా మనోహరాబాద్​లో 14, తూప్రాన్​లో 13.5, మాసాయిపేటలో 12, వేములవాడ లో 12, కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.9, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

భారీ వర్షానికి సిరిసిల్లలోని సంజీవయ్యనగర్, శాంతినగర్ తదితర కాలనీలు నీట మునిగాయి. కామారెడ్డి జిల్లాలో గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి మండలాల్లో వందలాది ఎకరాల్లో వరి, పత్తి, సోయా, మక్క పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 1,409 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. గ్రేటర్ వరంగల్ లో రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూర్​  మండలం రామేశ్వరపల్లిలో బొబ్బిలి చెరువు దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూం​ ఇండ్లు నీట మునిగాయి. చెరువు నిండి పైనుంచి నీరు ప్రవహించడంతో ఇండ్లలోకి వరద చేరింది. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. 

ముగ్గురు మృతి.. 

భారీ వర్షాలకు పిడుగు పడి ఇద్దరు చనిపోగా, చెరువులో గల్లంతై మరొకరు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామ్​నగర్ కాలనీకి చెందిన చలివేరు సరిత (30), మమత (32) కూలీ పనులకు వెళ్లగా.. కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్ సమీపంలో పిడుగు పడి ఇద్దరూ చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా చిట్యాల ఆస్పత్రికి తరలించారు. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన కుమ్మరి సుధాకర్.. మంబాపూర్ గ్రామ పటేల్ చెరువు వంతెన దాటుతుండగా, అలుగు ఉధృతంగా ప్రవహించడంతో జారిపడ్డాడు. ఆయన చెరువులో గల్లంతు కాగా, సాయంత్రం వంతెన దగ్గర చెట్ల కొమ్మల్లో శవం దొరికింది.