కొత్త పన్ను విధానంతో.. కోటి మందికి ప్రయోజనం

కొత్త పన్ను విధానంతో.. కోటి మందికి ప్రయోజనం
  • కొత్త పన్ను విధానంతో.. కోటి మందికి ప్రయోజనం
  • ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ: నిర్మల
  • పార్లమెంట్​లో వచ్చేవారం ఇన్​కమ్ ట్యాక్స్ బిల్లు 
  • బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్

న్యూఢిల్లీ:   కేంద్ర బడ్జెట్ లో తాము ప్రకటించిన కొత్త పన్ను విధానంతో కోటిమందికిపైగా పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త విధానంలో రూ. 12 లక్షల వరకూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, దీనివల్ల కోటి మందికి రిబేట్ లభించి, పన్ను భారం నుంచి ఉపశమనం దొరుకుతుందన్నారు. శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆదాయపు పన్ను శ్లాబుల్లో సవరణలు చేయడం ద్వారా ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు మిగిలేలా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

కాగా, ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని మారుస్తామని, ఇందుకోసం వచ్చే వారమే పార్లమెంట్ లో కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ‘‘ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం. ‘ముందు నమ్మండి. తర్వాత పరిశీలించండి’ అనే భావన ఆధారంగా ‘న్యాయం’ అనే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కొత్త ఐటీ బిల్లును రూపొందించాం. ప్రస్తుత పాత చట్టంతో పోలిస్తే సగం టెక్స్ట్ తోనే బిల్లును తెచ్చాం. చాప్టర్లు, పదాలను నేరుగా, స్పష్టంగా పొందుపర్చాం. పన్ను చెల్లింపుదారులు, అధికారులు సులభంగా అర్థం చేసుకునేలా ఇది ఉంటుంది” అని ఆమె వివరించారు. కొత్త చట్టంతో ట్యాక్స్ లిటిగేషన్లు, అనిశ్చితులు తొలగిపోతాయని ఆకాంక్షించారు. పార్లమెంట్ లో ఈ బిల్లు ఈజీగానే పాస్ అవుతుందన్నారు.