బూట్లలో విదేశీ కరెన్సీ.. ఎయిర్ పోర్ట్ లో రూ.10కోట్లకు పైగా స్వాధీనం.. ఇంత పెద్ద మొత్తం ఇదే తొలిసారి

బూట్లలో విదేశీ కరెన్సీ.. ఎయిర్ పోర్ట్ లో రూ.10కోట్లకు పైగా స్వాధీనం.. ఇంత పెద్ద మొత్తం ఇదే తొలిసారి

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ముగ్గురు తజికిస్థాన్ జాతీయుల నుంచి రూ.10 కోట్లకు పైగా విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. లగేజీలో ఉంచిన బూట్లలో విదేశీ కరెన్సీని దాచి ఉంచినట్లు సమాచారం. జూలై 21న చోటు చేసుకున్న ఈ ఘటనలో.. నిందితులు ఇస్తాంబుల్‌కు విమానం ఎక్కేందుకు వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే వారి బ్యాగేజీని చెక్ చేయగా.. వారి వద్ద నుంచి రూ.10.6 కోట్లకు విలువైన విదేశీ కరెన్సీ ( 7లక్షల 20వేల డాలర్లు లేదా 4 లక్షల 66 వేల 200యూరోలు) రికవరీ చేసినట్లు కస్టమ్స్ విభాగం ఓ ప్రకటనను విడుదల చేసింది. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.

కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, భారతదేశంలోని విమానాశ్రయం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించడం ఇదే మొదటిసారి. అయితే అధికారులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఒక బాల్యుడు కూడా ఉన్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.