ఏపీలో 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన

V6 Velugu Posted on May 31, 2021

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా ఏకకాలంలో 14 కొత్త మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం జిల్లా మార్కాపురం, చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం జిల్లా పెనుకొండ, కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోనిలలో ఏర్పాటు చేయనున్న కొత్త మెడికల్ కాలేజీలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం జగన్ వివరించారు.

 

Tagged ap cm jagan, , ap new medical colleges, cm jagan laid foundation, ap today updates, amaravati today updates

Latest Videos

Subscribe Now

More News