
- మత్తు దందా చేస్తున్న నలుగురి అరెస్టు
- 220 కిలోల ఎఫిడ్రిన్ సీజ్
- అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లుగా అంచనా
హైదరాబాద్,వెలుగు: ఫార్మా ముసుగులో నిషేధిత సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల కేంద్రంగా సాగుతున్న మత్తు మందు దందాను ఈగల్ ఫోర్స్ గురువారం బ్రేక్ చేసింది. ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్టు చేసింది. 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్‌ను సీజ్ చేసింది. దీని విలువ దేశంలో కిలో రూ.10 కోట్లు కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.72 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈగల్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన వస్తవయి శివరామకృష్ణ పరమవర్మ (52) అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేశాడు. తరువాత స్థానిక సిరీస్ లిమిటెడ్ కంపెనీలో క్వాలిటీ కెమిస్ట్‌గా2003 వరకు, బోయిన్‌పల్లిలోని వెస్ట్రన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో క్వాలిటీ అనలిస్ట్‌గా 2009 వరకు పని చేశాడు. అమలాపురంలో కొంత కాలం రొయ్యల పెంపకం బిజినెస్ చేశాడు.
బల్క్ డ్రగ్ ప్రొడక్షన్‌లో తనకున్న ఉన్న అనుభవంతో నిషేధిత సింథటిక్ డ్రగ్ ఎఫిడ్రిన్ సహా మత్తు మందులు తయారు చేయడం ప్రారంభించాడు. చెన్నై, బెంగళూరు, ముంబైకి సప్లయ్ చేసేవాడు. 2017 లో బెంగళూరు జోన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), 2019లో హైదరాబాద్ జోన్ ఎన్‌సీబీకి చిక్కాడు. అప్పట్లో 250 కిలోల ఆంఫెటమైన్, 10 కిలోల ఆల్ప్రజోలంను ఎన్‌సీబీ అధికారులు సీజ్ చేశారు.
ఎఫిడ్రిన్ తయారీ ఫార్ములాలో వినియోగిస్తున్న కెమికల్స్
ఎఫెడ్రిన్ తయారీకి అవసరమైన టోలుయిన్, బ్రోమిన్, అసిటోన్ వంటి ముడి పదార్థాలను శివరామకృష్ణ.. అనిల్‌కు అందించాడు. ఫార్ములా చెప్పాడు. దీంతో పాటు ఎఫిడ్రిన్ ఫార్ములా వినియోగించే సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, సోడియం బోరో హైడ్రైడ్ కొనుగోలు చేసేందుకు రూ.8 లక్షలు ఆన్‌లైన్ లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. శివరామకృష్ణ చెప్పిన ఫార్ములా ప్రకారం పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కేంద్రంగా అనిల్ ఎఫిడ్రిన్ ప్రాసెస్ ను ప్రారంభించి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేశాడు.
దీన్ని జీడిమెట్ల స్ప్రింగ్ కాలనీలోని శివరామకృష్ణ నివాసంలో స్టోర్ చేశారు. పాత డ్రగ్స్ కస్టమర్లను కాంటాక్ట్ చేశారు. సమాచారం అందుకున్న ఈగల్ ఫోర్స్ పోలీసులు. శివరామకృష్ణ నివాసంలో గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. శివరామకృష్ణతో పాటు వెంకటకృష్ణారావు, అనిల్, ముసిని దొరబాబును అరెస్టు చేశారు. ప్రసాద్ పరారీలో ఉన్నాడు.
జీడిమెట్లలోని పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కేంద్రంగా డ్రగ్స్ తయారీ
శివరామకృష్ణ కొంత కాలంగా హైదరాబాద్ జీడిమెట్లలో స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శివారు ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసేందుకు ప్లాన్ చేశాడు. గతేడాది డిసెంబరులో ఐడీఏ బొల్లారంలోని పీఎన్‌ఎమ్ (పోలయ్య నడిపమ్మ మడ్డు) లైఫ్ సైన్సెస్ ప్రొడక్షన్ మేనేజర్ కాకినాడకు చెందిన దంగెటి అనిల్ (31) ను కలిశాడు. ఇద్దరూ కెమికల్ ఎక్స్‌పర్ట్స్ కావడంతో శివారు ప్రాంతాల్లోని కెమికల్ కంపెనీల్లో ఎఫిడ్రిన్ డ్రగ్ తయారు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం అనిల్ పనిచేస్తున్న పీఎన్‌ఎమ్ కంపెనీ డైరెక్టర్లు మడ్డు వెంకటకృష్ణారావు(45), మడ్డు ప్రసాద్, జీడిమెట్లలోని విగ్నసాయి ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న ప్రొడక్షన్ ఆపరేటర్ ముసిని దొరబాబు (29) తో కలిసి ఎఫిడ్రిన్ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.