- భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీరు
- మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో
- మూడున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు
మహబూబ్‌నగర్, వెలుగు : యాసంగి సాగుకు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు భారీగా నీరు చేరింది. ఆ సీజన్లో వరికి దిగుబడులు బాగా వచ్చాయి. ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో యాసంగిలోనూ రైతులు వరి సాగుకు సిద్ధమయ్యారు. అటు వర్షాలు, ఇటు వరదలతో గ్రౌండ్ వాటర్ పెరగడం, రిజర్వాయర్లలో ఆశాజనకంగా నీరు ఉండడంతో వరి సాగుపై రైతులకు భరోసా ఏర్పడింది.
ఐదు విడతల్లో నీటి విడదల..
మహబూబ్నగర్జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా దేవరకద్ర, కోయిల్‌కొండ, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాలతోపాటు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, మరికల్ మండలాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు విడతలవారీగా యాసంగి సీజన్లో సాగునీటిని అందించేందుకు నిర్ణయించారు. జనవరి 5 నుంచి ఏప్రిల్14వ వరకు విడతలవారీగా నీరు ఇవ్వనున్నారు.
పది రోజులకు ఒకసారి చొప్పున కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని వదలనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.8 టీఎంసీల నీరు ఉండగా, ఇందులో ఒక టీఎంసీ నీటిని యాసంగి పంటలకు ఏప్రిల్‌వరకు ఇవ్వనున్నారు. భీమా-–1లో భాగమైన సంగంబండ రిజర్వాయర్ ద్వారా కూడా నిరుడు యాసంగిలో రైతులకు సాగునీటిని అందించారు. అయితే సీజన్చివరలో విపరీతమైన ఎండలు కావడంతో నీటిని విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్‌లో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత ఉంది. దీంతో రిజర్వాయర్కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించే అవకాశాలు ఉన్నాయి.
రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు..
ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో ఇన్ ఫ్లో నమోదైంది. దీంతో ఈ ప్రాజెక్టుల కింద రిజర్వాయర్లను ఇరిగేషన్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో నింపారు. ఇరిగేషన్ శాఖ రిపోర్ట్ ప్రకారం.. జూరాల ఫుల్ కెపాసిటీ 9.66 టీఎంసీలకుగాను.. ప్రస్తుతం 8.41 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ ఈ ప్రాజెక్టు మెయిన్టెనెన్స్, ఇతర రిపేర్ల కారణంగా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుకు ఇటీవల క్రాప్ హాలిడే ప్రకటించారు.
శ్రీశైలం ఫుల్ కెపాసిటీ 215.81 టీఎంసీలకుగాను ప్రస్తుతం 192.53 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టు ఆధారంగా కల్వకుర్తి లిఫ్ట్‌స్కీం ఉండగా, దీని పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్0.35 టీఎంసీలకు 0.32 టీఎంసీలు, జొన్నలబొగుడ 2.14 టీఎంసీలకుగాను 1.77 టీఎంసీలు, గుడిపల్లిగట్టు 0.98 టీఎంసీలకుగాను 0.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే తాజా యాసంగిలో ఈ లిఫ్ట్కింద 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆఫీసర్లు నిర్ణయించారు.
ఆ మేరకు నీటిని ఎత్తిపోసుకునే అవకాశాలున్నాయి. భీమా ప్రాజెక్టు పరిధిలోని లిఫ్ట్–1లో భూత్పూర్రిజర్వాయర్ కెపాసిటీ 1.31 టీఎంసీలకుగాను ప్రస్తుతం 1.15 టీఎంసీలు, సంగంబండ రిజర్వాయర్‌లో 3.31 టీఎంసీలకుగాను 2.32 టీఎంసీలు.. లిఫ్ట్2 పరిధిలోని రంగసముద్రం 1.89 టీఎంసీలకుగాను 1.59 టీఎంసీలు, శంకరసముద్రంలో 1.81 టీఎంసీలకుగాను 0.75 టీఎంసీల్లో నీరు నిల్వ ఉంది.
3.80 లక్షల ఎకరాల్లో వరి..
మూడేండ్లుగా మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో యాసంగి సీజన్లో వరి సాగు పెరుగుతూ వస్తోంది. గత సీజన్లో రెండు జిల్లాల్లో కలిసి 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్లో మాత్రం 60 వేల ఎకరాలకు అదనంగా పెరిగింది. రెండు జిల్లాల్లో కలిసి మొత్తం 3.80 లక్షల ఎకరాల్లో వరి సాగుకానుంది. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లాలో 2.01 లక్షలు, నారాయణపేట జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుకానుంది.
జనవరి 5 నుంచి నీరు విడుదల
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద ఆయకట్టు రైతులకు జనవరి 5 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ విజయేందిర బోయి అధ్యక్షతన కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులు, రైతు సంఘం నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు యాసంగి పంటలకు సాగునీటిని 5 విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
