లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు కరెంట్ రేట్లు తగ్గించండి ..టీజీఈఆర్సీకి ఇరిగేషన్ శాఖ లేఖ

లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు కరెంట్ రేట్లు తగ్గించండి ..టీజీఈఆర్సీకి ఇరిగేషన్ శాఖ లేఖ
  • ఇప్పుడున్న యూనిట్ ధర రూ.6.30 చాలా ఎక్కువ టీజీఈఆర్​సీకి ఇరిగేషన్ శాఖ లేఖ
  • హైడల్ పవర్​కు మా నీళ్లు వాడుకుంటూ రాయల్టీ కడుతున్నరు
  • మేము కూడా విద్యుదుత్పత్తి సంస్థల్లాగే రాయల్టీ చెల్లిస్తం
  • లేదంటే యూనిట్ విద్యుత్ తయారీకి అయ్యే ఖర్చునే కడ్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు కరెంట్ రేట్లను తగ్గించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్​ (టీజీఈఆర్​సీ)ని ఇరిగేషన్ శాఖ కోరింది. ఇప్పుడు యూనిట్ కరెంట్​కు జెన్​కో, ట్రాన్స్​కోలు చార్జ్ చేస్తున్న ధర అధికంగా ఉన్నదని పేర్కొన్నది. ఈ మేరకు కరెంట్ రేట్లను సవరించాలని కోరుతూ టీజీఈఆర్​సీకి ఇరిగేషన్ శాఖ లేఖ రాసింది. 

లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు ఇప్పుడు యూనిట్ కరెంట్​కు రూ.6.30 వసూలు చేస్తున్నారని, అది చాలా ఎక్కువని, హేతుబద్ధత కూడా లేదని పేర్కొన్నది. 

జల విద్యుత్ ఉత్పత్తిలో ఒక్క యూనిట్ ప్రొడ్యూస్​కు ఎంత ఖర్చవుతుందో అంతే లిఫ్ట్ స్కీములకు చార్జ్ చేయాలని, లేదంటే వర్షాకాలంలో ట్రాన్స్​కో ఇతర సంస్థల నుంచి కొంటే ఎంతవుతుందో అంతే బిల్లు వేయాలని డిమాండ్ చేసింది. అంతేగాకుండా ప్రభుత్వ లిఫ్ట్ స్కీములకు నెలనెలా ఒక కిలో వాట్​కు వసూలు చేస్తున్న డిమాండ్ చార్జీలు రూ.300ను రద్దు చేయాలని కోరింది.

లిఫ్టులు పనిచేసేది రెండు నెలలే..

తెలంగాణ ప్రాతం భౌగోళికంగా ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో లిఫ్టులు అనివార్యమని లేఖలో ఇరిగేషన్​ శాఖ పేర్కొన్నది. 450 మీటర్ల నుంచి 650 మీటర్ల ఎత్తు వరకు ఎత్తిపోయాల్సి వస్తున్నదని తెలిపింది. అందుకు ప్రస్తుతం 40 మెగావాట్ల నుంచి 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులను వినియోగిస్తున్నామని తెలిపింది. 2025, డిసెంబర్ 1 నాటికి 4 భారీ లిఫ్టులు పనిచేస్తున్నాయని, వాటి లోడ్​ 2819.80 మెగావాట్లు అని పేర్కొన్నది. 

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో 9 లిఫ్టులు 2026–27 నాటికి అందుబాటులోకి వస్తాయని, 7,348 మెగావాట్ల లోడ్ పడుతుందని తెలిపింది. పంపింగ్ ఎత్తు, ఓల్టేజ్​ వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని లిఫ్టులను 20 % ఓవర్ లోడ్ తీసుకునేలా డిజైన్ చేశారని, అంటే రికార్డెడ్​ లోడ్​ 80 శాతం ఉంటుందని తెలిపింది. ఈ లెక్కన 4 లిఫ్టులకు 20 శాతం ఓవర్ లోడ్ తీసేస్తే అసలు లోడ్​ 2,255.84 మెగావాట్లుగా ఉంటుందని, అందుబాటులోకి వచ్చే 9 లిఫ్టులకు 7,348 మెగావాట్లలో 20 శాతం ఓవర్​లోడ్ పోనూ 5878.40 మెగావాట్లే అసలైన లోడ్ అని వెల్లడించింది. 

పెద్ద లిప్టులన్నీ వర్షాకాలంలోనే 45 నుంచి 60 రోజుల (2 నెలలు) పాటు పనిచేస్తాయని తెలిపింది. మిగతా 10 నెలలు వాడకం ఉండదని తెలిపింది. వాస్తవ లోడ్​లో కేవలం 10 నుంచి 15 శాతం వినియోగమే ఉంటుందని పేర్కొన్నది. అది కూడా కేవలం లైటింగ్, ఏసీ, వెంటిలేషన్, పంపుల డీ వాటరింగ్ కోసమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ 1 నాటికి 55 చిన్న లిఫ్టులుండగా.. వాటి లోడ్​ 5,031.57 మెగావాట్లు అని తెలిపింది. 

2026 – 27 నాటికి మరో 25 అందుబాటులోకి వస్తాయని, వాటి లోడ్ 993.55 మెగావాట్లు అని తెలిపింది. వీటిలో 20 శాతం ఓవర్​లోడ్​ను తీసేస్తే.. అసలు లోడ్ 4,025.25 మెగావాట్లు, 794.84 మెగావాట్లుగా ఉంటుందని పేర్కొన్నది. ఈ లిఫ్టులు ఏడాదిలో 6 నెలలు పనిచేస్తాయని, మిగతా 6 నెలలు ఆఫ్​లోనే ఉంటాయని తెలిపింది.

మేమూ రాయల్టీ కడ్తం

విద్యుదుత్పత్తి చేసే సంస్థలు (జెన్​కో వంటివి) ఇరిగేషన్ శాఖ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి వచ్చే నీళ్లను వాడుకుంటున్నాయని, దానికి ఆయా సంస్థలు కేవలం రాయల్టీనే కడుతున్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. ఉదాహరణకు జెన్​కో ఒక టీఎంసీ నీళ్లతో ఒక మెగా యూనిట్ విద్యుత్​ను ఉత్పత్తి చేస్తే.. రూ.వెయ్యి రాయల్టీని ఇరిగేషన్ శాఖకు జెన్​కో చెల్లిస్తుందని తెలిపింది. 

ఈ నేపథ్యంలోనే నీటి లిఫ్టింగ్​కు ఒక మెగా యూనిట్ కరెంట్​ను ఇరిగేషన్ శాఖ వాడుకుంటే.. అంతే మొత్తంలో రాయల్టీని చెల్లించేలా అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, దానికి అదనంగా ట్రాన్స్​మిషన్​చార్జీలను ట్రాన్స్​కోకు చెల్లించేందుకు సిద్ధమని పేర్కొంది. ఒకవేళ అలా కానిపక్షంలో ఒక యూనిట్​ తయారీకి ఎంత ఖర్చవుతుందో అంతే మొత్తంలో చెల్లిస్తామని స్ప ష్టం చేసింది. అదనంగా సరఫరా చార్జీలను భరిస్తామని పేర్కొంది.