- తొలగిన అటవీ శాఖ అడ్డంకులు
- మంచిర్యాల తోళ్లవాగు నుంచి రసూల్‌పల్లి వరకు 9.8 కి.మీ. రహదారి విస్తరణ
- నిజామాబాద్–జగదల్ పూర్ మధ్య తీరనున్న ట్రాఫిక్ సమస్య
నస్పూర్/కోల్‌బెల్ట్, వెలుగు: నిజామాబాద్–జగదల్పూర్(చత్తీస్‌గఢ్)-63 రహదారిలోని మంచిర్యాల పట్టణం తోళ్లవాగు నుంచి జైపూర్మండలం రసూల్‌పల్లి వరకు 9.8 కిలోమీటర్ల ఫోర్‌లేన్ రహదారి విస్తరణ చురుగ్గా సాగుతోంది. అటవీశాఖ అడ్డంకులు తొలిగిపోవడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
మంచిర్యాల నుంచి చెన్నూరు, సిరొంచా(మహారాష్ట్ర) వైపు రాకపోకలకు నేషనల్హైవే 63 రహదారి ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. నిజామాబాద్–జగదల్పూర్రహదారిపై భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. రోడ్డు ఇరుగ్గా ఉండటంతో మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్పరిధిలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
రూ.59.79 కోట్లు మంజూరు
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం వార్షిక ప్రణాళిక(2021–-22)లో 7 బ్లాక్ స్పాట్స్వద్ద రోడ్డు విస్తరణ, ఆధునీకరణ, భూసేకరణ కోసం రూ.59.79 కోట్లు మంజూరు చేసింది. తోళ్లవాగు నుంచి రసూల్‌పల్లి వరకు ఫోర్‌లేన్, డివైడర్లు, యూటర్న్లు, సెంట్రల్లైటింగ్పనులు చేపట్టాల్సి ఉంది. అయితే శ్రీరాంపూర్శివారు నుంచి ఒకవైపు అటవీ భూమి ఉంది. బీఆర్ఎస్హయాంలో మాజీ సీఎం కేసీఆర్పర్యటన ఉందని ఆఫీసర్లు వేగంగా పనులు పూర్తి చేసేందుకు అనుమతులు లేకుండానే ఇందారం అటవీ బీట్ పరిధిలో రోడ్డు తవ్వారు.
దీనిపై అటవీ ఆఫీసర్లు కేసు నమోదు చేస్తూ యంత్రాలను సీజ్ చేసి జరిమానా విధించారు. అధికారులకు అటవీ భూమి తెలియదని, కేసు తీసేయాలని కోరగా.. కాంట్రాక్టర్‌పై నిబంధనల ప్రకారం కాకుండా నామమాత్రంగా జరిమానా విధించారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు కూడా వెళ్లాయి. తర్వాత రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయి. కేసు తొలగించాలంటూ జనవరిలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఎన్ హెచ్ ఆఫీసర్లు విన్నవించినా ఫలితం లేకపోయింది.
తొలగనున్న వాహనదారుల ఇక్కట్లు
ఫోర్లేన్రహదారి విస్తరణ అటవీ శాఖ అడ్డంకులతో ఏడేండ్లుగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్‌స్పాట్స్‌లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ రహదారి విస్తరణకు అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. శ్రీరాంపూర్బస్టాండ్ నుంచి జైపూర్మండలం రసూల్‌పల్లి వరకు ఫారెస్ట్ఆఫీసర్లు సరిహద్దు రాళ్లను బిగించారు.
మరోవైపు నేషనల్హైవే ఆఫీసర్లు మీటర్ లోతు, 3.75 మీటర్ల వెడల్పుతో రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. శ్రీరాంపూర్బస్టాండ్నుంచి రసూల్‌పల్లి వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు పర్మిషన్వచ్చినట్లు మంచిర్యాల ఎఫ్‌డీవో రత్నాకర్ తెలిపారు. పనులు పూర్తయితే వాహనదారుల ఇక్కట్లు తొలగనున్నాయి.
