
- శనివారం రాత్రి తొలిసారి..
- ఆదివారం రాత్రి మరోమారు ఉద్రిక్తత
- 36 గంటల కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
కటక్ : దుర్గా దేవి విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఒడిశాలోని కటక్ లో అల్లర్లు జరిగాయి. శనివారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలు పోలీసుల జోక్యంతో సమసిపోగా.. ఆదివారం రాత్రి మరోమారు అల్లర్లు చెలరేగాయి. స్థానిక దర్గా బజార్ గుండా విగ్రహ ఊరేగింపు జరుగుతుండగా అర్ధరాత్రి ఇంత భారీ శబ్దంతో ఊరేగింపేమిటని ఓ వర్గానికి చెందిన జనం అభ్యంతరం తెలిపారు. దీంతో గొడవ మొదలై ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీ చార్జి చేసి గుంపును చెదరగొట్టారు. అనంతరం కటక్ లో ఇంటర్నెట్ బ్యాన్ చేసి అల్లర్లు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పరిస్థితి సద్దుమణుగుతోందని అనుకున్న సమయంలో ఆదివారం సాయంత్రం వీహెచ్ పీ కటక్ లో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ సమయంలోనే గౌరీశంకర్ పార్క్ ఏరియాలో పలు షాపులను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీంతో సిటీలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కటక్ లో 36 గంటల కర్ఫ్యూ విధించారు. కాగా, శనివారం దుర్గా దేవి విగ్రహ ఊరేగింపు సమయంలో దాడికి పాల్పడ్డ వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.