
గచ్చిబౌలి, వెలుగు: తండ్రితో గొడవ పెట్టుకోవద్దని, బాగా చూసుకోవాలని నచ్చజెప్పిన బావపై ఓ యువకుడు పగ పెంచుకున్నాడు. బ్లేడుతో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గౌలిదొడ్డి బసవతారక నగర్ కు చెందిన కొమిరి రామకృష్ణను చిన్న కొడుకు శంకర్(19) తరచూ తిడుతూ, కొడుతూ వేధిస్తున్నాడు. రామకృష్ణ తన కుమార్తె భర్త చెల్లారు గిరి(23)కి ఫోన్ చేసి చెప్పాడు. గోపన్ పల్లిలోని హెచ్సీయూ వెనుక గేట్ సమీపంలో నివాసముండే గిరి జులై 1న మామ ఇంటికి వెళ్లాడు.
బావమరిది శంకర్ ను పిలిచి నాన్నను ఎందుకు కొడుతున్నావని, గొడవలు మానుకోవాలని సర్దిచెప్పాడు. ఆగ్రహానికి గురైన శంకర్ ‘నీ అంతు చూస్తాను’ అని బావను హెచ్చరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత బసవతారక నగర్ లోనే ఓ దుకాణం వద్ద గిరి నిలబడగా శంకర్ బ్లేడ్ తో గొంతు కోసేందుకు ప్రయత్నించగా మెడపై తీవ్ర గాయమైంది. గాంధీ ఆస్పత్రికి తరలించగా 12 కుట్లు పడ్డాయి. బుధవారం ఆస్పత్రి నుంచి వచ్చిన గిరి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శంకర్ ను రిమాండ్ కు తరలించారు.