గాంధీ దవాఖానలో నిలిచిన నీటి సరఫరా

 గాంధీ దవాఖానలో నిలిచిన నీటి సరఫరా
  • వాయిదా పడిన ఆపరేషన్లు.. కంపుకొడుతున్న వాష్​రూమ్స్​
  • ఇబ్బంది పడుతున్న పేషెంట్లు, సహాయకులు, నర్సింగ్ సిబ్బంది 
  • 24 గంటల తర్వాత 2 పంపుసెట్ల ద్వారా పునరుద్ధరణ!

పద్మారావునగర్, వెలుగు: మోటార్లు మొరాయించడంతో గాంధీ హాస్పిటల్​మెయిన్​బిల్డింగ్​లోని ఇన్​పేషెంట్ల వార్డులు, ఆపరేషన్ థియేటర్లకు దాదాపు 24 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోయి రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు విభాగాలకు సంబంధించిన ఆపరేషన్లు వాయిదా పడగా.. వైద్యసేవల్లో తీవ్ర జాప్యం నెలకొంది. గురువారం రాత్రి 1‌‌‌‌0 గంటల నుంచి నీటి సరఫరా నిలిచిపోగా 24 గంటలు గడుస్తున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని శుక్రవారం పలువురు పేషెంట్ల సహాయకులు ఆరోపించారు. 

తాగునీరు రాకపోవడంతో రూ.20 చొప్పున పెట్టి బాటిళ్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా వార్డుల్లోని బాత్‌‌‌‌రూమ్స్, వాష్‌‌‌‌రూమ్స్​తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని, వాటిని వినియోగించకుండా సిబ్బంది తాళం వేశారని ఆదేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రధాన భవనం ఎనిమిదో అంతస్తులో నర్సింగ్‌‌‌‌ కాలేజీ కొనసాగుతోంది. నీరు రాకపోవడంతో విద్యార్థులు నానాతంటాలు పడుతున్నారని పలువురు పేర్కొన్నారు. 

బాత్‌‌‌‌రూమ్ కు వెళ్లేందుకు గాంధీ మెడికల్‌‌‌‌ కాలేజీ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భవన సముదాయం వద్ద గల పవర్‌‌‌‌ బోర్‌‌‌‌ నుంచి నీటిని బకెట్లలో నింపుకొని తీసుకెళ్తున్నారని తెలిపారు. రెండున్నర నెలల క్రితం కూడా పంపుహౌస్​లో విద్యుత్ సమస్య తలెత్తి నీటి సరఫరా ఆగిపోయింది. అప్పుడు అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి కొత్త విద్యుత్ కేబుల్ లైన్లను ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకే మోటార్లు మొరాయించడం హాస్పిటల్​నిర్వహణ తీరుకు అద్దం పడుతోంది. అయితే 24 గంటల తర్వాత 6 పంపుసెట్లకు గానూ 2 పంపుసెట్ల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిసింది.