
వినాయక నవరాత్రుల్లో గణేష్ విగ్రహాల చేతిలో లడ్డూలు మాయమయ్యే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఏకంగా గణపయ్యనే చోరీ చేశారు. సిరిసిల్ల జిల్లా, గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథున్ని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు తమ ఇండ్లకు వెళ్లిపోయారు. అయితే తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి కంగు తిన్నారు. వినాయక ప్రతిమ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
వీధిలోని చిన్నారులంతా కలిసి చందాలు వేసుకుని మండపాన్ని ఏర్పాటు చేశారు. అయితే బుధవారం రాత్రి పూజల అనంతరం పిల్లలు, స్థానికులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. గురువారం ఉదయం మండపానికి వచ్చి చూసేసరికి విగ్రహం కనిపించకపోవడంతో అందరం బాధపడ్డామని స్థానికులు చెప్పుకొచ్చారు. ఆలయాల్లో హుండీ ఎత్తుకెళ్లడం చూశాం.. బంగారం, డబ్బు పోవడం చూశాం కానీ .. ఇలా దేవుడినే మింగే దొంగలున్నారా అంటూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ తరహా దొంగతనాలు ఎక్కువగా తమిళనాడులో జరుగుతుంటాయని సమాచారం.