
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో నవరాత్రులు భక్తుల పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ సన్నిధికి చేరారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రామాలు, పట్టణాల వీధుల్లోని వినాయక విగ్రహాలను కోలాటాలు, తీన్మార్ డ్యాన్సులు, డీజే పాటలు, బ్యాండ్ బాజాలు, శోభాయాత్రలు నిర్వహించి సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. కరీంనగర్ సిటీకి చెందిన విగ్రహాలను మానకొండూర్, కొత్తపల్లి చెరువులతోపాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం చేశారు.
నంబర్ 1 గణేశ్‌శోభాయాత్రలో చిన్నారుల నృత్యాలు, లవకుశుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టవర్ సర్కిల్ లో నిర్వహించిన పూజల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. శోభాయాత్రల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఉన్నతాధికారులతో సహా 650మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము వరకు వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరుగుతూనే ఉన్నాయి.
కరీంనగర్ మహాశక్తి అమ్మవారి ఆలయంలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహం ఊరేగింపులో కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్రాక్టర్ నడిపారు. అనంతరం భక్తులతో కలిసి బండి సంజయ్ స్వయంగా ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం తానే డ్రైవింగ్ చేశారు.
వేములవాడ/రాయికల్/ జగిత్యాల రూరల్/మల్యాల/ కోరుట్ల,వెలుగు : వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం సుమారు 300 వినాయకులు రాజన్న గుడి చెరువులో నిమజ్జనమయినట్లు కమిషనర్‌అన్వేశ్‌తెలిపారు. నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ మహేశ్ బి.గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం వేడుకలు వైభవంగా జరిగాయి.
శుక్రవారం పట్టణంలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయకులను భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా టవర్ సర్కిల్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం చేశారు.చింతకుంట చెరువు వద్ద నిమజ్జనం కు మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో వేలంలో గణపతి లడ్డూని మార్కెట్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి రూ. 17,516 లకు దక్కించుకున్నారు.
పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 9 రోజులుగా పూజలందుకున్న గణనాథులను శుక్రవారం నిమజ్జనం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొలువైన వినాయకులను ఎమ్మెల్యే విజయరమణారావు దగ్గరుండి నిమజ్జనం చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. గోదావరిఖని లక్ష్మీనగర్‌లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, మనాలీ ఠాకూర్ దంపతులు హారతి ఇచ్చి గణనాథుడి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన డ్యాన్స్‌చేసి ఉత్సాహపరిచారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.