నిజామాబాద్, వెలుగు : సిటీలోని ఖలీల్ వాడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంతో పాటు అర్గుల్‌లో ఏటీఎం చోరీకి విఫల యత్నం చేసిన హర్యానా స్టేట్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాతో సీపీ మాట్లాడారు. ఈ ముఠా గతేడాది జూలైలో హైదరాబాద్ షాపూర్‌నగర్ హెచ్డీఎఫ్సీ ఏటీఎం నుంచి రూ.30 లక్షలు కొల్లగొట్టారని వివరించారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంలు ఓపెన్ చేయడంలో ఐదుగురు సభ్యుల ముఠా సిద్ధహస్తులన్నారు. డిసెంబర్ 31న జహీరాబాద్‌లో ఏటీఎంలో దొంగతనానికి విఫలయత్నం చేసి నిజామాబాద్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను గ్యాస్‌కట్టర్‌తో తెరువడానికి ప్రయత్నించారన్నారు.
బ్లూకోల్ట్స్ పోలీసులు అటుగా వస్తున్న సంగతి గమనించి పారిపోయారన్నారు. అలారం మోగడంతో అర్గుల్‌లో ఏంటీఎం ఓపెన్ చేయడం ఆపేశారని తెలిపారు. అంతకు ముందు హర్యానాలోని ఉధంపుర, శివపురిలో ఏటీఎంలు తెరిచి రూ.లక్షలు కొల్లగొట్టిన కేసులో జైలుకు కూడా వెళ్లారన్నారు. శుక్రవారం కార్లో గ్యాస్ కట్టర్, కర్రలు పెట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్న గ్యాంగ్ సభ్యులు అబ్లుల్లా ఖాన్, మహ్మద్ అమీర్, వహాబ్ఖాన్, మహ్మద్ అజీజ్, శామొద్దీన్ను అరెస్ట్‌చేశామన్నారు. వీరంతా హర్యానా స్టేట్‌కు చెందిన వారని చెప్పారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
