కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములను కాపాడింది విద్యార్థి సంఘాలేనని, పక్కదారి పట్టించింది కమిటీ సభ్యులేనని కామారెడ్డి విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసి విద్య అవసరాల కోసం 264 ఎకరాల భూములు అప్పగిస్తే కొన్ని భూములు ఇతర సంస్థలకు ఇచ్చారన్నారు.
పోలీస్ స్టేషన్, దూరదర్శన్, స్టేడియం, గోదాములతో పాటు ప్రైవేట్ స్కూల్‌కు ఇచ్చారన్నారు. అప్పటి సొసైటీ సెక్రటరీ, సభ్యులు భూములను పక్కదారి పట్టించారన్నారు. దీంతో విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారన్నారు. 2015లో సొసైటీని రద్దు చేస్తూ ప్రభుత్వానికి తీర్మానం పంపారన్నారు. కానీ 2018లో 2 ఎకరాల 2 గుంటల భూమి శిశు మందిర్‌కు ఎలా లీజ్‌కు ఇచ్చారని ప్రశ్నించారు.
ఆరోరా ఇంజినీరింగ్ కాలేజీకి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేనే వహించాలన్నారు. ఎమ్మెల్యే తన మాటలతో విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డిగ్రీ కాలేజీ స్థలాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్, కాలేజీ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ బాలు, బీవీఎం స్టేట్ సెక్రటరీ విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అరుణ్‌కుమార్, టీజేఎస్ జిల్లా ప్రెసిడెంట్ లక్ష్మణ్, పీడీఎస్ఎస్ జిల్లా సెక్రటరీ సురేశ్, బీసీ విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్ నీల నాగరాజు, ఎన్ఎస్యూఐ జిల్లా సెక్రటరీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
