డస్ట్​బిన్లు​ లేవు..స్వచ్ఛ ఆటోలు రావు​.. గ్రేటర్ సిటీలో కంపు

డస్ట్​బిన్లు​ లేవు..స్వచ్ఛ ఆటోలు రావు​..  గ్రేటర్ సిటీలో కంపు
  • డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో ఎత్తేసిన బల్దియా
  • కాలనీల్లో ఇంటింటికి వెళ్లని స్వచ్ఛ ఆటోలు 
  • జీవీపీ పాయింట్లలోనే మళ్లీ చెత్త వేస్తున్న జనాలు 
  • రోడ్లపై వేయకుండా బల్దియా సిబ్బంది కాపలా
  • 2,3 రోజులైనా ఆటోలు రావడం లేదంటున్న పబ్లిక్

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ సిటీలో చెత్త సమస్య తొలగడం లేదు. రెండేండ్ల కింద డస్ట్ బిన్​లెస్​ సిటీ పేరుతో చెత్త కుండీలను బల్దియా ఎత్తేసింది. ప్రత్యామ్నాయ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో  చెత్త సమస్య మళ్లీ తీవ్రమైంది. ఏండ్లు గడుస్తున్నా డస్ట్ బిన్ లెస్ సిటీగా మారడం లేదు. గతంలో గార్బేజ్ వేస్టేజ్ పాయింట్ల(జీవీపీ)లోని డస్ట్ బిన్లలో చెత్త వేసేవారు. వాటిని తీసుకెళ్లేందుకు సిబ్బందికి ఈజీగా ఉండేది. ప్రస్తుతం జనం చెత్తను జీవీపీ పాయింట్లలో వేస్తుండగా ఎలాంటి ఫలితం లేదు. డస్ట్ బిన్లు లేక వేసిన చెత్తంతా రోడ్లపైకి చేరుతోంది.

దీంతో కొన్ని మేజర్ పాయింట్ల వద్ద బల్దియా సిబ్బందిని కాపలా ఉంచింది. నిఘా పెట్టి ఎస్​ఎఫ్ఏ, శానిటేషన్ వర్కర్లకు షిఫ్ట్​ల వారీగా డ్యూటీ వేస్తుంది. ప్రతి సర్కిల్​లో మూడు నుంచి నాలుగు జీవీపీ పాయింట్లు ఉండగా ఎంత చేసినా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. ఇంటింటి చెత్త సేకరణపైనా బల్దియా  దృష్టిపెట్టడం లేదు. దీంతో  చెత్త వేసేదెక్కడని సిటిన్లు ప్రశ్నిస్తున్నారు. 

ఆటోలు వెళ్లకపోతుండగా..

గ్రేటర్​లో కోటికిపైగా జనాభా నివసిస్తుండగా  కేవలం 4,500 స్వచ్ఛ ఆటోలు మాత్రమే ఉన్నాయి. ఇందులో దాదాపు 500లకు పైగా ఫీల్డ్​లోకి వెళ్లడంలేదు.  ఓనర్​ కమ్​ డ్రైవర్ స్కీమ్​ కింద స్వచ్ఛ ఆటోలు అందించగా కొందరు తీసుకొని పత్తాలేకుండా పోయారు. మరికొందరు సొంత పనులకు వాడుకుంటుండగా చెత్త సేకరణకు చాలా ప్రాంతాల్లో ఆటోలు పోవడంలేదు. కొన్ని ప్రాంతాల్లో టైమ్​కి రాకపోతుండగా చెత్తను వేయలేకపోతున్నామని, ఇంటి వద్ద  పెడితే తీసుకెళ్లడం లేదని జనాలు చెబుతున్నారు.. బయట పెడితే కుక్కలు చెల్లాచెదురు చేస్తున్నాయని  పేర్కొంటున్నారు.  దీనిపై అధికారులు ఫోకస్​ పెట్టడం లేదు.  చెత్త ఆటోలపై గతంలో పలువురు కార్పొరేటర్లు కౌన్సిల్ మీటింగ్​లో  మేయర్​ను ప్రశ్నించారు.

దీనిపై జనం కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బల్దియా నిర్లక్ష్యంగానే ఉంటోంది. 2021 డిసెంబర్ వరకు 3,150 స్వచ్ఛఆటోలతో సిటీలో చెత్త సేకరణ కొనసాగింది. అదే ఏడాది డిసెంబర్​ చివరలో 1,350 ఆటోలను కొత్తగా అందించారు. అప్పటి నుంచి చెత్త తరలింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే సమస్య నెలకొంది. రెండు, మూడు రోజులకోసారి వస్తున్నాయని జనం ఆరోపిస్తున్నారు. 4,500 ఆటోలకు ప్రతి నెల రూ.4 కోట్లకుపైగా ఈఎంఐలను బల్దియా చెల్లిస్తోంది.  30 శాతం ఆటోలు చెత్తను సేకరించడంలేదు.  ప్రతి రోజు దాదాపు వెయ్యికిపైగా ఆటోలు చెత్త సేకరణకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. \

ALSO READ :రాష్ట్ర సరిహద్దులపై డీజీపీ ఫోకస్

సిబ్బంది కాపలా..

రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో గతంలో మంత్రి కేటీఆర్, మేయర్​ విజయలక్ష్మి అధికారులపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ ప్రిన్సిపల్ ​సెక్రటరీ, బల్దియా కమిషనర్లు రంగంలోకి దిగారు. రోడ్లపై చెత్త కనిపిస్తే  జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్​వోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెత్తను తొలగించడమే కాకుండా తిరిగి వేయకుండా చూడాలని స్పష్టం చేశారు. దీంతో ఎక్కువగా చెత్తను వేసే జీవీపీ పాయింట్ల వద్ద 24 గంటలు కాపలాగా సిబ్బందిని పెట్టారు. షిఫ్ట్​ల వారీగా కొందరు డ్యూటీలో ఉంటున్నారు. 

 యాక్షన్ ప్లాన్ ఎక్కడ..?

గతేడాది సెప్టెంబర్ 20న జరిగిన కౌన్సిల్ మీటింగ్​లో మేయర్ విజయలక్ష్మి చెత్త సమస్యపై అసహనం చెందారు. సిటీలో చెత్తను చూసి తానే సిగ్గు పడుతున్నానని వ్యక్తంచేశారు. అన్ని పార్టీలతో కలిసి చెత్త సమస్య లేకుండా ప్రాంతాల వారీగా యాక్షన్ ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు. నేటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి కౌన్సిల్ లోనూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు ప్రశ్నిస్తూనే ఉన్నా.. మేయర్ స్వయంగా హామీ ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేటర్లు మండిపడుతున్నారు.  

నష్టాలను చెబుతున్నాం

రోడ్లపై చెత్త వేయొద్దు. అలా చేస్తే దుర్వాసన వస్తుంది. ఇంటింటికి స్వచ్ఛ ఆటో వస్తుంది. అందులోనే చెత్త వేయాలి. జనం రోడ్లపై చెత్త వేయకుండా కాపలా ఉంటున్నం. అలా చేస్తే జరిగే నష్టాలను చెబుతున్నం. సిటిజన్లు సహకరించాలి.

- జి. మైపాల్ గౌడ్, ఎస్ఎఫ్ఏ, హయత్​నగర్

రోజంతా ఉంటున్నం

రోడ్లపై చెత్త వేయకుండా  రాత్రి, పగలు జీవీపీ పాయింట్ల వద్ద నిఘా పెడుతున్నం. చెత్త వేసి వెళ్లేవారి ఏరియా ఎక్కడో తెలుసుకొని స్వచ్ఛ ఆటో డ్రైవర్ ఫోన్ నంబర్ ఇస్తున్నం. అందరూ స్వచ్ఛ ఆటోల్లోనే చెత్త వేయాలని సూచిస్తున్నాం. 

- నాగరాజు, ఎస్ఎఫ్ఏ, టోలిచౌకి​