- ఆ లోపు స్టాండింగ్ కమిటీ ఆమోదం
- విలీనమైన 27 లోకల్ బాడీలు కలుపుకొని భారీ బడ్జెట్
- రాష్ట్ర బడ్జెట్లోనూ కేటాయింపులు పెరిగే చాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విలీనమైన లోకల్ బాడీలను కలుపుకొని రూ.13 వేల కోట్లతో జీహెచ్ఎంసీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. అంతలోపు సభ్యులకు ముసాయిదా కాపీలు సర్క్యులేట్ చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 8,440 కోట్లతో అధికారులు బడ్జెట్ ను రెడీ చేయగా, ఈసారి 27 లోకల్ బాడీల విలీనంతో బల్దియా పరిధి పెరిగింది. దీంతో దీనికితగినట్టుగా దాదాపు రూ. 13 వేల కోట్లతో మెగా బడ్జెట్ ను రూపకల్పన చేస్తున్నట్లు తెలిసింది.
పాత జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లు, ఇటీవలే విలీనమైన లోకల్ బాడీల్లో ఏర్పాటు చేసిన 27 సర్కిళ్ల నుంచి ఇటీవల వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు తుది దశకు చేరింది. బడ్జెట్ ముసాయిదాపై అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించిన తరువాత ఆమోదం కోసం ముసాయిదాను సర్కారుకు పంపనున్నారు. విలీనానికి ముందు పాత పరిధికి రూ.11,050 కోట్లతో బడ్జెట్ రూపొందించాలని అధికారులు భావించారు కానీ విస్తరణ తర్వాత 300 వార్డుల డీలిమిటేషన్ పూర్తికి దగ్గరపడడంతో కొత్త బడ్జెట్‌పై దృష్టి సారించారు.
రాష్ట్ర బడ్జెట్ పైనే బల్దియా ఆశలు
గ్రేటర్ విస్తరణ తరువాత రానున్న తొలి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులపై జీహెచ్ఎంసీ ఆశలు పెట్టుకుంది. ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధి, విస్తీర్ణం పెరగడంతో పాటు హెచ్సిటీ కింద రూ.7,038 కోట్లతో సుమారు 23 ప్రాజెక్టుల పనులు చేపట్టాల్సి ఉండడంతో సర్కారు తన బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తుందన్న అంచనాలున్నాయి. ఇటీవలే విలీనమైన 27 లోకల్ బాడీల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకున్న అధికారులు వాటన్నంటికీ రూ. 2 వేల నుంచి రూ.2,500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులను ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే జీహెచ్ఎంసీకి సర్కారు రూ. 7 వేల కోట్లకు పరిపాలన మంజూరీ ఇవ్వగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 13 వేల కోట్ల కిపైగా కేటాయింపు ప్రతిపాదనలను సర్కారుకు పంపనున్నట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు బాగానే కేటాయిస్తుంది.
