
- అక్కడ వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయనున్న బల్దియా
- తొలగించినవి ఆఫీసులోనే వేర్వేరు చోట్ల ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని మేయర్ గేటు ముందు దాదాపు పదిహేనేండ్లుగా ప్రారంభించకుండా ముసుగేసిన మూడు విగ్రహాలను అక్కడి నుంచి తరలించారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత 2009లో అప్పటి మేయర్ బండ కార్తీకరెడ్డి నిర్ణయం మేరకు బల్దియా హెడ్డాఫీసులో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆవిష్కరణ జరగక ముందే.. పోటీగా జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలను వైఎస్ విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేయించారు. ఇందులో వైఎస్ విగ్రహం ఎత్తులో ఉండడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో అన్ని విగ్రహాల ఆవిష్కరణ ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ విగ్రహాలకు ముసుగువేసి ఉంచారు. దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. గతేడాది బల్దియాలోని ఉద్యోగ సంఘాల లీడర్లతో సమావేశమైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విగ్రహాల గురించి ప్రస్తావించారు. ఎలా ముందుకు వెళ్లాలో చెప్పాలనడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. తర్వాత విగ్రహాలను తొలగించి అక్కడ వాటర్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మూడు విగ్రహాలను తొలగించి అక్కడి నుంచి తరలించారు. త్వరలోనే ఆ ప్రాంతంలో వాటర్ ఫౌంటెయిన్ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. కమిషనర్ కార్యాలయం గేట్ వద్ద అంబేద్కర్, మేయర్ గేటు వద్ద ఇరువైపులా గాంధీ, వైఎస్ ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.