భూములు కొనేటోళ్లకు డబుల్ దెబ్బ!

V6 Velugu Posted on Jan 22, 2022

  • ఆర్నెల్లు తిరక్కముందే మార్కెట్ వ్యాల్యూను మళ్లీ పెంచనున్న ప్రభుత్వం
  • వ్యవసాయ భూముల విలువ 40 నుంచి 100 శాతం పెంపు
  • ప్లాట్లు, ఫ్లాట్ల విలువ 30 నుంచి 200 శాతం దాకా..
  • అసెస్ మెంట్ కమిటీల ప్రమేయం లేకుండానే ప్రపోజల్స్

హైదరాబాద్, వెలుగు: ఆర్నెల్లు తిరక్కముందే మరోసారి భూముల మార్కెట్ వాల్యూను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను ఏరియాను బట్టి ప్రస్తుతం ఉన్న దానిపై 40 నుంచి 100 శాతం పెంచబోతున్నట్లు తెలిసింది. ప్లాట్లు, ఫ్లాట్ల వాల్యూను 30 నుంచి 200 శాతం దాకా పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని ఖరీదైన ప్రాంతాల్లో మార్కెట్ విలువలు రెండు, మూడు రెట్లు పెరిగే అవకాశముంది. వరుసగా రెండు సార్లు రేట్లు పెరగడం వల్ల భూములు కొనేటోళ్లకు రిజిస్ట్రేషన్ చార్జీల భారం డబుల్ కానుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి.. సుదీర్ఘంగా కసరత్తు చేసి ప్రపోజల్స్ సిద్ధం చేశారని, అవి సీఎం కేసీఆర్‌‌‌‌ వద్దకు శుక్రవారం రాత్రి చేరాయని తెలుస్తోంది. సీఎం అంగీకరిస్తే వచ్చే ఫిబ్రవరి 1 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఏడాది గ్యాప్‌‌‌‌లో రెండోసారి

రూరల్ ఏరియాలో ప్రతి రెండేళ్లకోసారి, అర్బన్ ఏరియాలో ఏడాదికోసారి రిజిస్ట్రేషన్‌‌‌‌ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఒకే ఏడాదిలో రెండు సార్లు పెంచేందుకు సర్కారుకు సిద్ధం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడంటే అప్పుడు భూముల విలువలకు సవరణలు చేసుకునేలా గతంలోనే గుట్టుగా చట్టంలో మార్పులు చేసుకున్న ప్రభుత్వం.. అందుకు సంబంధించిన జీవోను పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదని తెలిసింది. నిరుడు జులైలో రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల మార్కెట్ వాల్యూతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన విషయం తెలిసిందే. కొత్త చార్జీలు జులై 22 నుంచి అమల్లోకి వచ్చాయి. సరిగ్గా ఆర్నెల్లకు మరోసారి మార్కెట్ విలువను పెంచుతోంది. గతేడాది వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ ధరను 50 శాతానికి, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30 శాతానికి, మధ్య శ్రేణి భూముల ధరను 40 శాతానికి పెంచింది. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. ఈ సారి వ్యవసాయ భూముల కనీస మార్కెట్ వాల్యూ లక్షగా నిర్ణయించినట్లు తెలిసింది.

16 వేల కోట్ల ఆదాయమే టార్గెట్

రాష్ట్ర ప్రభుత్వం 2021 – 22 బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. పాత చార్జీలతో ఆ టార్గెట్ రీచ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ వాల్యూ పెంచింది. ఇప్పటిదాకా 7,420 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి వరకు రూ.10 వేల కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో 16 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కమిటీల్లేవ్.. అసెస్‌‌‌‌మెంట్ లేదు..
సాధారణంగా భూముల విలువల సవరణ కోసం ముందుగా సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ కన్వీనర్‌‌‌‌గా, కలెక్టర్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా మున్సిపల్ కమిషనర్ (అర్బన్‌‌‌‌లో), జెడ్పీ సీఈఓ(రూరల్‌‌‌‌లో) సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఏరియాను బట్టి వారే వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల విలువను అసెస్‌‌‌‌ చేసే వారు. జిల్లాకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి కలెక్టర్‌‌‌‌ పంపేవారు. కానీ నిరుడు మార్కెట్ వాల్యూ పెంచిన సమయంలోగానీ, ఇప్పుడు గానీ ముందస్తుగా ఎలాంటి ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర స్థాయిలోనే అధికారులు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా మార్కెట్ విలువను సవరించి.. కేవలం సంతకాల కోసమే కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

భూముల మార్కెట్ వాల్యూ సవరణకు సర్కార్ అనుమతి

రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఈ మేరకు జీఓ నంబర్ 23ను విడుదల చేసింది. మార్కెట్ వాల్యూ పెంపు కోసం సెంట్రల్ వ్యాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీని నియమించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని సీఎస్ సోమేశ్‌‌‌‌ కుమార్ ఆదేశించారు.

Tagged Telangana, CM KCR, LANDS, land registration, Market Value

Latest Videos

Subscribe Now

More News