పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌పై .. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ!

పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌పై .. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ!
  • పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌‌పై లీగల్ ఒపీనియన్ తీసుకోనున్న జిష్ణుదేవ్ 

హైదరాబాద్, వెలుగు:  పంచాయతీరాజ్​చట్టం–2018 సవరణ ఆర్డినెన్స్​ విషయంలో గవర్నర్​ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 15వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్​ చట్టంలోని 285(ఏ) నిబంధనను సవరించింది. ఇందులో  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిరికల్ డేటా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని మార్చి ఆర్డినెన్స్​ఫైల్‌‌ను గవర్నర్‌‌‌‌కు పంపింది. అయితే దీనిపై గవర్నర్​ లీగల్​ ఒపీనియన్​తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్​సవరణకు సంబంధించి కూడా సీఎస్​, పంచాయతీరాజ్​ ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ తీసుకోనున్నట్లు తెలిసింది. గురువారం గవర్నర్​ సిద్దిపేట జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ చట్ట సవరణపై వివరించాలని భావిస్తున్నారు.

 గవర్నర్​ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఆర్డినెన్స్‌‌కు సంబంధించి రాజ్‌‌భవన్​నుంచి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని సెక్రటేరియెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కుల గణన సర్వే, ఎంపిరికల్​ డేటా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఇచ్చే జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందనే దానిపైనే కొంత టెన్షన్​నెలకొందని చెబుతున్నారు.