ధర్మసాగర్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఎన్ని ట్రక్కులు మిల్లులకు వెళ్లాయని, ఓపీఎంఎస్ ద్వారా ఎంతమంది రైతుల వివరాలను ఎంట్రీ చేశారని, ధాన్యానికి సంబంధించిన ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రక్ సీట్లను కలెక్టర్ పరిశీలించారు.
పాల శీతలీకరణ కేంద్రం పరిశీలన
విజయ డెయిరీ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్-ను కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం సందర్శించారు. డెయిరీ యూనిట్ కెపాసిటీ, నాణ్యత పరీక్షలు, ఏయే గ్రామాల నుంచి పాల సేకరణ చేస్తున్నారని అడిగారు. విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ ఈ యూనిట్ 2008 లో 3000 లీటర్ల కూలింగ్ కెపాసిటీ తో స్థాపించారని, ప్రస్తుతం ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని 20 గ్రామాల నుంచి రోజు 1700 లీటర్ల పాల సేకరణ జరుగుతుందన్నారు.
పాడి రైతులకు చెల్లిస్తున్న పాలబిల్లుల విధానం, చెల్లింపుల ప్రక్రియపై సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై జిల్లా కలెక్టర్ కు పాడి రైతులు వినతిపత్రం సమర్పించారు. ధర్మసాగర్, రాపాకపల్లి గ్రామాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరిస్తున్న కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, స్థానిక తహసీల్దార్ సదానందం, ఎంపీవో సయ్యద్ అఫ్జల్ , డీపీఎం రాజేంద్రప్రసాద్, ఏపీఎం దేవానంద్, అధికారులు పాల్గొన్నారు.
