ప్రజావాణి దరఖాస్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ప్రజావాణి దరఖాస్తులపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును సీరియస్ గా పరిగణించి, వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్​లో అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, డీఆర్వో వైవీ గణేశ్ తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి 91 అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులపై 15 రోజుల్లోగా సమీక్ష నిర్వహించాలని డీఆర్వో వై.వీ.గణేశ్ కు సూచించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో మండలాల స్పెషల్ ఆఫీసర్లు స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్‌ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. 

ప్రైవేట్ వెంచర్ రోడ్డుపై ఫిర్యాదు.. 

ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ వెంచర్ అనుమతులకు విరుద్ధంగా రోడ్డు వేస్తున్నారని, దీంతో తమ ఇండ్లను కోల్పోయే పరిస్థితి ఉందని కాలనీ వాసులు గ్రీవెన్స్​లో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ వెంచర్ కోసం 40 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని, జీపీ రికార్డుల ప్రకారం అక్కడ కేవలం 20 ఫీట్ల రోడ్డుకు మాత్రమే ప్రపోజల్ ఉందని కాలనీ వాసులు తెలిపారు. అనుమతులకు మించి రోడ్డు వేయడం వల్ల తమ ఇంటి స్థలాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పనులను అడ్డుకున్నప్పటికీ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ తమ మాటను పట్టించుకోకుండా వెంచర్ నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ లో కలెక్టర్​ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ కోసం గ్రామ కార్యదర్శికి ఫోన్​ చేయగా స్పందించలేదు.