ఉగ్రవాదులను చేరదీస్తూ, సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్నారు..: పాక్ పై విరుచుకుపడ్డ భారత్..

 ఉగ్రవాదులను చేరదీస్తూ, సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్నారు..: పాక్ పై విరుచుకుపడ్డ భారత్..

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో భారత్ మంగళవారం పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చింది. భారత ప్రతినిధి క్షితిజ్ త్యాగి, పాకిస్తాన్ వైమానిక దళం (PAF) ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో దాదాపు 30 మంది ప్రజలు చనిపోయారు.

పాకిస్తాన్ ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై ఆరోపణలు చేస్తూ, UNHRC రిపోర్టును తప్పుగా వాడుకుంటుందని క్షితిజ్ త్యాగి ఆరోపించారు.  భారత భూభాగాన్ని కోరుకోవడం మానేసి, అక్రమ ఆధీనంలో ఉన్న భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపై దృష్టి పెట్టండి అని అన్నారు.

జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 60వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, సొంత దేశ ప్రజలపై బాంబులు వేయడం ఆపేస్తే, వేరే విషయాలపై దృష్టి పెట్టేందుకు సమయం దొరుకుతుంది అని పాకిస్తాన్‌ను ఎద్దేవా చేశారు. త్యాగి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెప్టెంబర్ 21న ఖైబర్ పఖ్తుంఖ్వాలో PAF జరిపిన వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలు సహా 30 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ సైన్యం ఈ వార్తలను  కొట్టిపారేసింది. అయితే, ప్రత్యక్ష సాక్షులు మాత్రం బాంబు దాడుల వల్ల చాలా ఇళ్ళు కూలిపోయాయని, శిథిలాల కింద నుంచి మృతదేహాలు బయటకు తీశారని చెప్పారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా పాకిస్తాన్ వైమానిక దాడులను విమర్శిస్తూ, ఇది దేశ ప్రజల పట్ల దారుణమైన నిర్లక్ష్యం అని సూచించింది.