తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసింది: హరీష్ రావు

తెలంగాణకు బీజేపీ ద్రోహం చేసింది: హరీష్ రావు

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు, నేతలకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీపై విపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఖమ్మంలో జరుగుతున్న సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పుతుందన్నారు. ఈనెల 18న జరగనున్న ఖమ్మం బీఆర్ఎస్ సభకు దేశంలోని ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని మంత్రులు ఆరోపించారు. వరంగల్ జిల్లాకు రావలసిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతారో సమాదానం చెప్పాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీ పార్టీ కాదా..? అని నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.