
- సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో తెలంగాణ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు కల్పించకపోవడంతో వందలాది మంది తెలంగాణ విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లోని పీజీ సీట్లలో 25 శాతం మేనేజ్‌మెట్ కోటా ఉంటుందని, వాటిలో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అవన్నీ ఆలిండియా విద్యార్థులకు వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు.
ఏపీలో 85 శాతం లోకల్ రిజర్వేషన్లుండగా.. మన రాష్ట్రంలో మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ లోకల్ కోటాను కల్పిస్తే మన విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. వెంటనే మేనేజ్‌మెంట్ కోటాలోనూ 85శాతం లోకల్ కోటా కల్పించాలని హరీశ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలన్నారు. కొత్త జీవో జారీ చేసి రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేలా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కోరారు.