
పర్యావరణాన్ని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యతన్నారు. జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ... అలాంటి వ్యవస్థను కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్నవనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.
లోకహితం కోసం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఎడ్ల సంధ్యరమేష్ దంపతులు చేపట్టిన శ్రీ రుద్రసహిత శతచండి యాగం బృహత్తరమైనదని దత్తాత్రేయ అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుట్ట మీద బీజేపీ రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ ఎడ్ల సంధ్యరమేష్ దంపతుల ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే శ్రీ రుద్రసహిత శతచండి యాగం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై పూజలు నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితం కోసం పాటుపడాలన్నారు. ఇలాంటి యాగాల ద్వారా హిందూ భావన పెరిగి ఆధ్యాత్మిక చింతన అలవడుతుందన్నారు. ధర్మాన్ని రక్షించాలన్నారు.