నూహ్‌ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం..144 సెక్షన్ విధింపు

 నూహ్‌ లో మరోసారి ఉద్రిక్త వాతావరణం..144 సెక్షన్ విధింపు

హర్యానా రాష్ట్రంలోని నూహ్‌  జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను విశ్వహిందూ పరిషత్ ఆగస్టు 28వ తేదీన నిర్వహించాలని  నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం, నూహ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా నుహ్ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేవారు. అన్ని స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులకు  ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

 144 సెక్షన్  విధింపు

 బ్రజమండల్ జలాభిషేక యాత్రకు అనుమతి లేకపోవడంతో నుహ్ జిల్లా ఉన్నతాధికారులు సెక్షన్ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు గుంపులు, గుంపులుగా తిరగొద్దని ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.  మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు. అటు శోభాయాత్ర సందర్భంగా హర్యానా ప్రభుత్వం నుహ్ జిల్లాలో 1,900 మంది పోలీసు సిబ్బంది, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద మోహరించింది. 

ఉత్తర భారతదేశం ప్రకారం శ్రావణమాసం చివరి సోమవారాన్ని(ఆగస్టు 28)  పురస్కరించుకుని హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని హిందూ సంస్థలు  శోభాయాత్రకు పిలుపునిచ్చాయి. అయితే, సెప్టెంబరు 3-7 వరకు జీ20 షెర్పా గ్రూప్‌ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శోభాయాత్రకు అనుమతివ్వలేమని నుహ్ జిల్లా అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ  ఆగస్టు 28వ తేదీన శోభాయాత్రను నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్‌ తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. నూహ్‌ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బారికేడ్లను పెట్టారు. బయటి జిల్లాల వారిని నూహ్‌లోకి అనుమతించడం లేదు. దూకాణాలు తెరవద్దని స్థానికులకు సూచించారు. ఆగస్టు 28వ తేదీ సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఆగస్టు 28వ జరిగే అన్ని పరీక్షలను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

మరోవైపు భద్రతా కారణాల వల్ల బ్రజమండల్ జలాభిషేక యాత్రకు అనుమతినివ్వలేదని సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు. అయితే  ప్రజలు తమ సమీపంలోని దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని సూచించారు. 

హర్యానాలోని నుహ్ జిల్లాలో జులై 31న మత ఘర్షణలు చెలరేగాయి. విశ్వహిందూ పరిషత్‌ చేపట్టిన ర్యాలీపై కొందరు దుండగులు జరిపిన దాడి హింసాత్మకంగా మారింది. ఈ  ఘర్షణల్లో  ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మత ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 393 మందిని అరెస్టు చేయగా, 118 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.