
- భక్తిప్రవత్తులతో హయగ్రీవ జయంతి
- నేటి నుంచి నిత్య కల్యాణాలు షురూ
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శనివారం యాగశాలలో పూర్ణాహుతితో ముగిశాయి. అంతకు ముందు ఉదయం ఆలయ ప్రాంగణంలోని హయగ్రీవస్వామి జయంతిని భక్తిపవత్తులతో నిర్వహించారు. అభిషేకం నిర్వహించి నీటిని భక్తులపై చల్లారు. నూతన వస్త్రాలను అలంకరించి, ప్రత్యేక పూజలు, ప్రసాద నివేదన చేశారు. హయగ్రీవ జయంతి సందర్భంగా చిన్నారులకు పుస్తకాలు, స్వామి ప్రసాదాన్ని అందజేశారు.
గర్భగుడిలో శ్రీసీతారామచంద్రస్వామి మూలవరులకు సుప్రభాత సేవ అనంతరం సువర్ణ తులసీ దళాలతో అర్చన జరిపించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్య కల్యాణాలను నేటి(ఆదివారం) నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు.