- హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అలాట్ చేసిన గ్రూప్-1 అధికారులతో మంత్రి దామోదర
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించిన గ్రూప్- 1 అధికారులు గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టమని, అనారోగ్యంతో బాధపడుతున్న ఎంతో మందికి సేవ చేసే అవకాశం ఈ విభాగంలో ఉంటుందన్నారు. హాస్పిటళ్ల పనితీరు, ఆరోగ్య రంగంలో టెక్నాలజీ, గ్రామీణ ప్రాంతాలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.
అంటువ్యాధుల సమస్య తగ్గి, జీవనశైలి వ్యాధులు (నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్) పెరిగాయని, దీనిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రతి జిల్లాలోనూ డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ఎన్‌సీడీ రోగులకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆధునిక టెక్నాలజీని జోడించి వైద్య సేవలు మెరుగుపర్చే దిశగా ఆలోచించాలని అధికారులకు మంత్రి సూచించారు.
