ఆస్పత్రులు చేర్చుకుంటలే.. సర్కారు రీయింబర్స్ చేస్తలే

ఆస్పత్రులు చేర్చుకుంటలే.. సర్కారు రీయింబర్స్ చేస్తలే
  • హెల్త్​ స్కీమ్​ పని చేయక ఉద్యోగుల అవస్థలు
  • ఆస్పత్రులు చేర్చుకుంటలే.. సర్కారు రీయింబర్స్ చేస్తలే
  • బకాయిలు పేరుకుపోవడంతో చికిత్సకు ముందుకు రాని ప్రైవేటు దవాఖానలు
  • డబ్బులు కట్టి ట్రీట్‌‌మెంట్ చేయించుకుంటున్న ఉద్యోగులు
  • నెలలు గడుస్తున్నా ఫీజును రీయింబర్స్ చేయని సర్కారు
  • ఫైల్ క్లియరెన్స్‌‌కు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు

హైదరాబాద్‌‌, వెలుగు:  ప్రభుత్వ ఉద్యోగులకు హాస్పిటల్ ఖర్చుల తిప్పలు తప్పడం లేదు. దవాఖాన్లకు సర్కార్ వందల కోట్లు బకాయిలు పెట్టడం, ట్రీట్‌‌మెంట్ ప్యాకేజీల రేట్లు తక్కువగా ఉండడంతో ఈహెచ్‌‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) కింద ట్రీట్‌‌మెంట్ చేసేందుకు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు ముందుకు రావడంలేదు. ఈహెచ్‌‌ఎస్ కింద ట్రీట్‌‌మెంట్ చేయాలని పట్టుబడితే తమను చులకనగా చూస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. డబ్బులు పెట్టి ట్రీట్‌‌మెంట్ చేయించుకుంటే రీయింబర్స్‌‌మెంట్‌‌ సకాలంలో చేయకపోవడం ఉద్యోగులను మరింత బాధిస్తోంది. వేల మంది ఉద్యోగులు రీయింబర్స్‌‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. 

ఏడాది కిందట దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ బిల్లులు రాలేదు. దీంతో తమ రీయింబర్స్‌‌‌‌మెంట్ స్టేటస్ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు సంబంధిత ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది కరోనా సమయంలో ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో ట్రీట్‌‌‌‌మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎంత ఖర్చు పెట్టుకున్నా.. రూ.లక్ష మాత్రమే రీయింబర్స్‌‌‌‌మెంట్ ఇస్తామని సర్కార్ ప్రకటించింది.

డబ్బులు ఇస్తే వెంటనే క్లియరెన్స్‌‌‌‌

ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల మెడికల్ బిల్లుల ఫైళ్లు హైదరాబాద్‌‌‌‌ కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌‌‌కు వస్తాయి. సెక్షన్ ఆఫీసర్ల పరిశీలన తర్వాత డాక్టర్ల కమిటీ ఆయా బిల్లులను వెరిఫై చేసి, అమౌంట్ ఎంత ఇవ్వాలో నిర్ణయిస్తుంది. అయితే ఫైళ్లు క్లియర్ అవడానికి ఆర్నెల్లు పడుతోంది. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన ఫైళ్లు.. ఉద్యోగికి సంబంధించిన డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్తాయి. అక్కడ క్లియర్ అయ్యాక ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు వెళ్తాయి. ఫైనాన్స్‌‌‌‌ వాళ్లు ఉద్యోగి ఖాతాకు బిల్లు జమ చేస్తారు. ఈ తతంగమంతా జరగడానికి 6 నుంచి 8 నెలలు పడుతోంది. దీంతో బిల్లు పెట్టినప్పటి నుంచి ఉద్యోగి ఖాతాలోకి డబ్బు జమ అయ్యే నాటికి ఏడాది దాటుతోంది. మరోవైపు ఇక్కడ డాక్టర్ల కమిటీ కంటే.. సంబంధిత సెక్షన్‌‌‌‌ చెప్పేదే వేదంగా నడుస్తోంది. సెక్షన్‌‌‌‌లో డబ్బులు ఇచ్చినోళ్ల ఫైళ్లకు వెంటనే క్లియరెన్స్ వస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌‌‌‌ పెట్టడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట ధర్నాకు తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్‌‌‌‌ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

డబ్బులు కట్టి ఆపరేషన్ 

అమ్మకు తుంటి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రెండు హాస్పిటళ్లలో అడిగితే ‘ఈహెచ్‌‌‌‌ఎస్ కింద చేయం’ అన్నరు. డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయించిన. పోయినేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం బిల్లు పెట్టుకున్నాం. ఇప్పటిదాకా రాలేదు.

- నరెడ్ల శ్రీనివాస్‌‌‌‌, టీచర్, బెజ్జంకి,  సిద్దిపేట జిల్లా

ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నం

ఈహెచ్‌‌ఎస్ పనిచేయక డబ్బులు పెట్టి ట్రీట్‌‌మెంట్ చేయించుకుంటున్నాం. రీయింబర్స్‌‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదు. కొంత మందికి సంవత్సరమైనా రాలేదు. ఈ బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌లో, ఫైనాన్స్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఫైల్ క్లియరెన్స్‌‌కు లంచాలు తీసుకుంటున్నారు. ఇదే విషయంలో ధర్నాకు పిలుపునిచ్చాం.

- అశోక్‌‌కుమార్‌‌‌‌, 
ప్రెసిడెంట్‌‌, టీపీటీఎఫ్‌‌