- సగటున ఎకరాకు 8 క్వింటాళ్లు తగ్గిన దిగుబడి
- భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి పంట
కామారెడ్డి, లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వరి పంట దిగుబడులు భారీగా తగ్గాయి. నెల రోజులపాటు కురిసిన భారీ వర్షాల వల్ల పూత రాలడంతోపాటు తెగుళ్లు సోకాయి. పలుచోట్ల పంటలు పూర్తిగా నీట మునుగగా మరింత నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడిన రైతుల శ్రమ నీటిపాలైంది. సాధారణంగా సన్న వడ్లు ఎకరాకు 25 నుంచి 26 క్వింటాళ్లు, దొడ్డు వడ్లు ఎకరాకు 28 నుంచి 29 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. కానీ వర్షాల వల్ల ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.
ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా 5 .21 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 2,85,825 ఎకరాలు సాగు కాగా, దొడ్డు రకం వరి 2 లక్షల 77 ఎకరాలు, సన్నరకం 85,748 ఎకరాల్లో సాగైంది. 6,88,838 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, అధిక వర్షాల వల్ల
దిగుబడి తగ్గింది.
నష్టాల్లో రైతులు..
భారీ వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. దొడ్డు వడ్లు ఎకరాకు 20 క్వింటాళ్లు, సన్న రకం 18 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ప్రధానంగా లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, రామారెడ్డి, నిజాంసాగర్, బీర్కూర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, బిచ్‌కుంద్, పిట్లం మండలాల్లో వరి పంటలు అధికంగా దెబ్బతిన్నాయి.
ఎకరాకు సుమారు రూ.25 వేల పెట్టుబడి కాగా, కోతలు, రవాణా ఖర్చులు అధికమయ్యాయి. దీంతో ఎకరాకు రూ.15వేల నుంచి 20 వేల వరకు రైతులు నష్టపోయారు. అతి భారీ వర్షాల వల్ల 26 వేల ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతింది. నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో వందలాది ఎకరాల వరి పంట
నీట మునిగి కుళ్లిపోయింది.
ఎడతెరిపి లేని వానలతో తగ్గిన దిగుబడి
ఎడతెరిపి లేకుండా నెల రోజులపాటు కురిసిన వానలనకు వరి దిగుబడి తగ్గింది. పూత దశలో వానలు పడటంతో పూత రాలడంతోపాటు పంటకు తెగుళ్లు సోకాయి. కొన్ని ప్రాంతాల్లో పంట పూర్తిగా నీట మునిగింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఎకరాకు వరి దిగుబడి 20 శాతం కంటే ఎక్కువగా తగ్గింది.- మోహన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
రూ.70 వేలకు పైగా నష్టం
6 ఎకరాల్లో వరి సాగు చేశా. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం జరిగింది. గత ఏడాది 6 ఎకరాల్లో 465 బస్తాలు (ప్రతి బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చింది. ఈసారి కేవలం 373 బస్తాలకే పరిమితమైంది. మొత్తం 33 క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో సుమారు రూ.70 వేల నష్టం వచ్చింది.- బానోతు పరశురామ్, బోనాల్ తండా
29 క్వింటాళ్లు తగ్గిన దిగుబడి
ఈ వానాకాలంలో 4 ఎకరాల్లో వరి వేస్తే 91 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఎకరాకు 23 క్వింటాళ్ల వడ్లు మాత్రమే చేతి కొచ్చాయి. గత ఏడాది వానాకాలంలో ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి 7 క్వింటాళ్లు తగ్గాయి. పెట్టుబడి, రావాణా ఖర్చులు పెరిగాయి. - అన్నం సాయిలు, మెంగారం
