ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

దేశ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముంబైలోనూ అడపాదడపా వర్షాలు కురవడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల రిత్యా ముంబై పొరుగున ఉన్న పాల్‌గఢ్ జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు నల్లసోపారా, వసాయ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.

ముంబై, థానేలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు.. తాజాగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక జూలై 21న కురిసన వర్షాలకు అంధేరి, కుర్లా, ఘట్‌కోపర్‌, చెంబూర్‌ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వరదల కారణంగా అంధేరీ సబ్‌వే రాకపోకలను నిలిపివేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రద్దీ సమయాల్లో సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులు 10 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, పశ్చిమ రైల్వే మార్గంలో సర్వీసులు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ రోజు కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.