
మండు వేసవిలోనూ అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలాన్ని తలపించేలా.. ఈదురుగాలు, ఉరుములు, పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. తాజాగా పలు జిల్లాలకు పిడుగుల అలెర్ట్ ఇచ్చింది.
పిడుగుల ముప్పు
ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు ఉందని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైయస్సార్ జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండవద్దని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రజలకు సూచించింది. ఒకవేళ పిడుగుల పడేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకుంటే చెప్పులు ధరించి చెవులు మూసుకుని మోకాలిపై కూర్చోవాలని సూచించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ & నికోబార్ దీవులలో మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది. పశ్చిమ బీహార్ నుండి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్ గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఇపుడు బలహీన పడింది. ఆంధ్ర ప్రదేశ్, యానాం లలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి
కోస్తా ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ & యానాంలో సోమ, మంగళ వారాల్లో ( మే 22,23) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు30 – 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది. పలు చోట్ల తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ ప్రాంతంలో
సోమ, మంగళ వారాల్లో ( మే 22,23)- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° నుండి 4° C వరకు ఎక్కువుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ.వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశముంది.