RRR సినిమాపై పిల్ కోట్టేసిన హైకోర్టు

RRR సినిమాపై పిల్ కోట్టేసిన హైకోర్టు

ఆర్ఆర్ఆర్ సినిమాపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టిపారేసింది. అల్లూరి సీతారామరాజు, కొమ్రుంభీం చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే అల్లూరి, కొమ్రుంభీంలను దేశభక్తులుగా ఈ సినిమాలో చూపామని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కల్పిత కథేనని  దర్శక, నిర్మాతలు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఆర్ఆర్ఆర్ కు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలన్న పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమాతో అల్లూరి, కొమ్రుంభీంల పేరు, ప్రఖ్యాతులకు భంగం కలగదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా  ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, స్టార్ హీరో అజయ్ దేవగణ్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. ఇందులో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తోండగా.. ఎన్టీఆర్… గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.