గుడ్ల సరఫరా టెండర్లకు లైన్‌ క్లియర్‌

గుడ్ల సరఫరా టెండర్లకు లైన్‌ క్లియర్‌
  • పిటిషన్​ను డిస్మిస్‌ చేసిన హైకోర్టు
  • పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ల సరఫరాకు జారీ చేసిన టెండర్ల ప్రక్రియ కొనసాగింపునకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. టెండర్ల ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆధారాల్లేకుండా టెండర్ల ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్‌  చేసింది. పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. అంగన్ వాడీ కేంద్రాలతో పాటు గురుకులాలు, కేజీబీవీలు, హాస్టల్స్‌  కలిపి ఉమ్మడిగా టెండర్ల నిర్వహణ కోసం జిల్లా కొనుగోలు కమిటీలను ఏర్పాటు చేసింది. 

సెప్టెంబరు 1 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఎంఏ పౌల్ట్రీ అండ్‌  ఫీడ్‌కు టెండరును ఖరారు చేయడాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన సిరి ఫామ్స్‌.. హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్‌  నగేశ్‌  భీమపాక విచారణ పూర్తిచేసి తుది ఉత్తర్వులను జారీ చేశారు. టెండరు షరతులను అమలు చేయని కంపెనీకి టెండరు కేటాయింపు చెల్లదని పిటిషనర్‌  న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్‌  గుడ్డు ధర రూ.6.69 పైసలకు టెండరు వేశారని, ప్రతివాది కంపెనీ రూ.6.10 కే సరఫరా చేస్తోందని వివరించారు. టెండరుకు సంబంధించిన పత్రాలను తర్వాత సమర్పించిందన్నారు.

వాదనలపై హైకోర్టు.. టెక్నికల్‌ సమస్యలను అడ్డంపెట్టుకుని తక్కువ ధరకు టెండర్‌  వేసిన దానిని అడ్డుకోవాలని పిటిషనర్‌  ప్రయత్నం చేశారని తప్పుపట్టింది. తక్కువ ధరకు సరఫరా చేసే సంస్థను ఎంచుకునే హక్కును రద్దు చేయాలని కోరడాన్ని ఆక్షేపించింది. ప్రభుత్వానికి నష్టం వస్తుందనే ఆధారాలు చూపి ఉంటే స్టేకి ఆస్కారం ఉండేదని చెప్పింది. ఈ వ్యాజ్యంలో అలాంటివి ఏమీ లేనందున పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.