
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుల నియామకంపై స్టేటస్‌కో విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన జీవో 28 అమలుపై యథాతథస్థితిని కొనసాగించాలని పేర్కొంటూ.. ఈ నియామకాలపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ పి.మాధవీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులుగా కె. కాత్యాయిని, బడిపడగ రాజిరెడ్డి నియామక జీవో 28ని సవాల్ చేస్తూ కొండాపురం సరిత పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషనర్ లాయర్ ఏపీ రెడ్డి వాదిస్తూ, కాత్యాయినితోపాటు పిటిషనర్ సరిత కూడా రాత పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు సాధించారని, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికను పెండింగ్లో ఉంచారని పేర్కొన్నారు. కమిషన్ చైర్మన్, మెంబర్స్ నియామక వివాదం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. ఉద్యోగుల భర్తీ నిబంధనలను సవరించాలంటూ సుప్రీం కోర్టు మార్చిలో జారీ చేసిన ఆదేశాలతో సంబంధం లేకుండా నియామకాల జీవో వెలువడిందన్నారు. వాదనల తర్వాత ప్రభుత్వంతోపాటు సభ్యులుగా నియమితులైన ఇద్దరికీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.