కోకాపేట్ భూముల డబ్బులు థర్డ్ పార్టీ  అకౌంట్​లో జమ 

కోకాపేట్ భూముల డబ్బులు థర్డ్ పార్టీ  అకౌంట్​లో జమ 
  •   కొనుగోలుదారులు ఎలాంటి పనులు చేపట్టొద్దు 
  •   అట్లయితేనే జీవో 111పై కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా ఆగుతం 
  •   ప్రభుత్వానికి హైకోర్టు షరతులు  


 జీవో111 పరిధిలో నుంచి గ్రామాల తొలగింపు, ఇతర అంశాలపై హైపవర్ కమిటీ రిపోర్టు వచ్చే వరకూ ఆగాలంటే  ప్రభుత్వం కొన్ని షరతులు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కోకాపేట భూముల వేలంలో ఎంత వచ్చినా.. ఆ మొత్తాన్ని ఎస్క్రో (థర్డ్ పార్టీ) అకౌంట్ లో జమ చేయాలని తేల్చిచెప్పింది. మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌‌టీపీ), మౌలిక వసతుల పనులు చేసే వరకు ఆ డబ్బును ఆ అకౌంట్ లో ఉంచేందుకు సిద్ధపడాలని చెప్పింది. భూముల్ని కొన్న వాళ్లు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదంది. వేలం వేసిన భూముల్లో నిర్మాణాలకు అవసరమైన అన్ని సౌలతులు ఏర్పాటు అయ్యే వరకూ నయాపైసా కూడా ముట్టుకోరాదని చెప్పింది. వీటిపై అధికారులతో చర్చించి ప్రభుత్వం తన వైఖరిని గురువారం విచారణలో చెప్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. వట్టినాగులపల్లిలోని ప్రైవేట్‌‌ భూములను జీవో111 పరిధి నుంచి మినహాయించాలంటూ అగ్ని అగ్రోటెక్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను  డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. 
ఆ వార్తలు అబద్ధం.. 
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌‌ జనరల్‌‌  వాదనలు వినిపిస్తూ, హైపవర్‌‌ కమిటీ రిపోర్టు వచ్చే వరకూ వేచి చూడాలని కోరారు. జీవో 111ను విత్‌‌డ్రా చేస్తామని సీఎం ప్రకటించినట్లు వచ్చిన వార్తలు నిజం కాదన్నారు. కమిటీ రిపోర్టును బట్టి జీవోపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పగా పత్రికలు ఆ విషయం రాయలేదన్నారు. ఆలస్యమైన మాటవాస్తమేనని, చివరిసారిగా గడువు ఇవ్వాలని, రెండుమూడు నెలలు సమయం ఇవ్వాలని పలుసార్లు కోరారు. పిటిషనర్‌‌ అగ్ని అగ్రోటెక్‌‌ భూమి జీవో పరిధిలోకే వస్తుందన్నారు. హిమాయత్‌‌సాగర్, ఉస్మాన్‌‌సాగర్‌‌ పరివాహక ప్రాంతాల రక్షణకు రెండు కమిటీల స్టడీ రిపోర్టుల తర్వాతే ఆ జీవో వెలువడిందని తెలిపారు. 2007లో పలు వినతుల తర్వాత ఈపీటీఆర్‌‌ఐ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. 
ప్రభుత్వమే తప్పు చేసి.. ఆగాలంటరా?   
ఏజీ వాదనపై హైకోర్టు స్పందిస్తూ.. ప్రభుత్వ భూముల్ని వేలం వేసి వందల కోట్లు ఆర్జించాలంటే ఆఘమేఘాలపై వేలం వేస్తారని, ఇందుకు కమిటీలు వెంటవెంటనే రిపోర్టులూ ఇస్తాయని, వాటిని ప్రభుత్వం ఆమోదిస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం వేసిన కమిటీలు రిపోర్టులు ఇచ్చి 4 ఏండ్ల వారం రోజులు అయ్యిందని, ఇప్పటికీ రిపోర్టులు బయటపెట్టట్లేదని, హైకోర్టుకూ ఇవ్వట్లేదని ఆక్షేపించింది. ప్రభుత్వమే తప్పు చేస్తూ రెండు మూడు మాసాలు ఆగలేరా? అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని చెప్పింది.  వట్టినాగులపల్లిలో క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియాలో పిటిషనర్ల భూములు లేవన్న నివేదిక విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. ప్రభుత్వం చెప్పినట్లుగా రెండుమూడు నెలలు ఆగుతామని, అప్పటి వరకూ కోకాపేట భూముల వేలం సొమ్మును ఎస్క్రో అక్కౌంట్‌‌లో పెడతారా? అని అడిగింది.  ఉత్తర్వులు జారీకీ బెంచ్​ సిద్ధమైంది. అదనపు ఏజీ వినతితో విచారణను గురువారానికి వాయిదా పడింది.