శ్రీ కృష్ణుడి గెటప్లోని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

శ్రీ కృష్ణుడి గెటప్లోని ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం రూపొందడంపై  శ్రీకృష్ణ జాక్, ఆదిబట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు..విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. 

విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరం..

ఖమ్మం నగరంలో  ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. మొత్తం రూ.4 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. అయితే  ఈ విగ్రహం శ్రీకృష్ణుడి గెటప్ లో ఉండటం వివాదానికి కారణమవుతోంది. 

యాదవ సంఘాల అభ్యంతరం..

ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడాన్ని యాదవ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని..అయితే శ్రీకృష్ణుడి గెటప్లో మాత్రం వద్దని సూచిస్తున్నాయి. ఎన్టీఆర్జయంతి, వర్ధంతి టైంలో శ్రీకృష్ణుడికి నివాళులర్పించడం ఆ దేవుడిని అపవిత్రం చేయడమేనంటున్నాయి. ఎన్టీఆర్ వేసిన ఇతర ఏ గెటప్​లో అయినా విగ్రహాన్ని పెట్టుకోవచ్చని చెబుతున్నాయి. కానీ  శ్రీకృష్ణుడి వేషాధారణలో మాత్రం వద్దని అంటున్నాయి.  

వివాదంలోకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్..

ఖమ్మం నగరంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వ్యతిరేకంగా సినీ నటి  కరాటే కళ్యాణి పోరాటం చేస్తున్నారు. ఆమె  యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలిగా ఉండటంతో..విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమంటే శ్రీకృష్ణుడిని కించ పరచడమే అని చెప్తున్నారు. ఇది యాదవుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశార. 

"మా"  సీరియస్..

సినీ నటి కరాటే కళ్యాణి పోరాటంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ అంశంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు. " మా" పాలక వర్గాన్ని సంప్రదించకుండా కరాటే కళ్యాణి ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై మా ఆగ్రహం వ్యక్తి చేసింది. గత మా అసోసియేషన్ ఎన్నికల్లో కరాటే కళ్యాణి మంచు విష్ణు ప్యానెల్ తరపున  పోటీ చేశారు.