- సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడిన లంబాడా కుటుంబానికి జారీ చేసిన ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ ను రద్దు చేయడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ ఏర్పాటు సమయంలోనూ, తర్వాత కూడా ఈ కుటుంబానికి ఇచ్చిన ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చౌహాన్ దేవానంద్ కుటుంబం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ అప్పీలు దాఖలైంది. సింగిల్ జడ్జి తీర్పు సమర్ధనీయమేనని పేర్కొన్న డివిజన్ బెంచ్ అప్పీలును కొట్టివేసింది.
1950 నాటికి తెలంగాణలో నివసిస్తున్న లంబాడీలకు లేదా వారి పూర్వీకులకు ఎస్టీ హోదా వర్తిస్తుందని, కానీ 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వారికి ఈ హోదా వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. అప్పీలుదారులు 1956 తర్వాతే వలస వచ్చారని నిర్ధారించింది. ఆలిండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ కలెక్టర్ ఈ కుటుంబానికి జారీ చేసిన ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను రద్దు చేశారు. దీన్ని సవాల్ చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టివేయడంతోపాటు, డివిజన్ బెంచ్ కూడా ఆ ఉత్తర్వును సమర్థించింది .
