V6 News

HMT ఆపరేషన్ సింధూర్ డిజైన్ వాచ్ : చావులతో వ్యాపారం ఏంట్రా అంటూ నెటిజన్ల ఆగ్రహం

HMT ఆపరేషన్ సింధూర్ డిజైన్ వాచ్ : చావులతో వ్యాపారం ఏంట్రా అంటూ నెటిజన్ల ఆగ్రహం

ఇది యాపారం.. అది చావు అయినా.. శుభం అయినా.. ఇది యాపారం.. అవును ఇలాగే ఉంది ఇప్పుడు HMT కంపెనీ తీరు. లేటెస్ట్ గా HMT ఆపరేషన్ సింధూర్ డిజైన్ తో కొత్త వాచ్ రిలీజ్ చేసింది. దీని ధర 2 వేల 400 రూపాయలు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మార్కెట్ లో రిలీజ్ అయిన ఈ వాచ్ లపై దుమారం రేగుతోంది. నెటిజన్లు అయితే తిట్టిపోస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే భారతీయుల చావు కదా.. చావులతో వ్యాపారం ఏంట్రా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మన భారతీయుల చావులను కూడా యాపారంగా వాడుకుంటారా అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండియాలో ఒకప్పుడు చాలా పేరున్న వాచీల కంపెనీ HMT వాచెస్. ఈ కంపెనీ ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ JGSL 01 అనే కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ డిజైన్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఈ వాచ్ ని కంపెనీ స్టీల్ కలర్ ఇత్తడి కేసు, తెల్లని డయల్, నల్లని లెదర్ బెల్ట్‌తో తయారు చేసి సాధారణంగా పెట్టుకునే వాచ్ గా పరిచయం చేసింది.

దీని డిజైన్‌లో ప్రత్యేకత ఏంటంటే గంటలు, నిమిషాల ముల్లు మధ్యలో ఉండే భాగం కుంకుమ ఆకారం ఉంటుంది. అలాగే డయల్‌పై కుడివైపున కుంకుమ పడినట్లుగా ఉంటుంది. ఈ డిజైన్, ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ అంటోంది.

అయితే, చాలామంది నెటిజన్లు ఈ డిజైన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక దుఃఖకరమైన, బాధ సంఘటనను ఒక వస్తువుతో ముడిపెట్టి వ్యాపారం చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఒకరు ఇది సంతోషపడాల్సిన విషయమా ? చాలా మంది ప్రాణాలు కోల్పోయారు  అని అనగా.. మరొకరు ఈ ఏడాది అత్యంత చెత్త వాచ్ డిజైన్ అవార్డు దీనికే దక్కుతుంది అని ఎద్దేవా చేశారు. కొంతమందైతే  ఈ వాచ్ డిజైన్ నివాళిగా కాకుండా, ప్రచారంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. మరికొంతమందరు  ఒక గొప్ప కంపెనీ ఇలా చేస్తుందని ఊహించలేదు. ఒక విషాదం నుండి లాభం పొందేందుకు దోపిడీ అని ఆరోపించారు.

 "ఆపరేషన్ సిందూర్" అంటే ఏంటి: ఈ గడియారం డిజైన్‌పై ఇంత వివాదం ఎందుకు వచ్చిందంటే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగింది. ఇందులో కొంతమంది భారత పౌరులు చనిపోయారు. దీనికి బదులుగా మే నెలలో భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ సైనిక ఆపరేషన్‌కు ఆపరేషన్ సిందూర్ అని కోడ్‌నేమ్ పెట్టారు.

'సిందూర్' (కుంకుమ) అనేది భారతదేశంలో వివాహిత మహిళలు ధరిస్తారు. ఈ పేరును ఎంచుకోవడం ద్వారా, దాడి తర్వాత కలిగిన దుఃఖం, నష్టం, సైన్యం  ప్రతిస్పందనను సూచించాలని భావించారు. భారత సైన్యం అధికారిక లోగోలో కూడా కుంకుమ మూలాంశం ఉంది.

ఈ వివాదంతో దేశంలో జరిగిన విషాద సంఘటనలను లేదా సైనిక అంశాలను వస్తువులతో ముడిపెట్టి వ్యాపారం చేయడం ఎంతవరకు సున్నితమైన విషయం అనేది తేటతెల్లమైంది. ఇలా చేయడం వల్ల వ్యాపార లాభాల కోసం బాధితుల బాధలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.