పట్నం కేంద్రంగా పెద్దపల్లి పాలిటిక్స్‌‌

పట్నం కేంద్రంగా పెద్దపల్లి పాలిటిక్స్‌‌

టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్పటి నుంచి పెద్దపల్లి జిల్లా నాయకుల్లో హడావుడి మొదలైంది. జిల్లాలో వర్గాలు ఎక్కువ కావడంతో పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు తమ వంతు ప్రయత్నాలు ప్రారం భించారు.  మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌లో మకాం పెట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల హవా లేదని, హైకమాండే అంతా చూసుకుంటుందని భావిస్తున్న వారంతా అక్కడే ఉండి పని పూర్తి చేసుకోవాలని  ఆలోచిస్తున్నారు.  అయితే పదవులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇస్తారా? లేదంటే పైరవీలు చేసుకున్న వారికా అనే ప్రశ్న
వస్తోంది. 


పెద్దపల్లి, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత  కరీంనగర్​ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా ఈద శంకర్​రెడ్డి పని చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత  పార్టీ కార్యవర్గాలను రద్దు చేశారు. అప్పటి నుంచి కొత్త కార్యవర్గాలు ఏర్పడలేదు.  ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులే పార్టీని నడిపించారు. నియోజకవర్గాల ఇన్‌‌‌‌చార్జులే బాస్‌‌‌‌లుగా చలామణి అయ్యారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కార్యవర్గాలతో పని లేదనట్లు టీఆర్ఎస్ హైకమాండ్ ​వ్యవహరించింది. గ్రౌండ్ ​లెవల్‌‌‌‌లో నాయకులు, కార్యకర్తలు తమ స్థానిక నేతలను కాదని ఎమ్మెల్యేల చుట్టూ తిరిగారు.  దీంతో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధే పార్టీకి కూడా ప్రతినిధి అనే విధంగా తయారైంది. అన్ని జిల్లాల్లో ఉన్నట్లే జిల్లా టీఆర్ఎ స్‌‌‌‌లోనూ తెలంగాణ ఏర్పాటు కాకముందు, అయిన తర్వాత అన్నట్లు నాయకులు తయారయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరినవారే ఎక్కువగా ఉన్నారు. వారే ఇక్కడ అజమాయిషీ చేస్తున్నారు. దీంతో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఉద్యమకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
రామగుండంకే చాన్స్..​
పెద్దపల్లి జిల్లాలో మూడు నియోజకవర్గాలున్నాయి. ఈ సారి జిల్లా పార్టీ బాధ్యతలు పెద్దపల్లి నియోజకవర్గానికి కాకుండా రామగుండం నియోజకవర్గానికి చెందిన నాయకుడికి ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో కరీంనగర్​ ఉమ్మడి  జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈద శంకర్​రెడ్డి పని చేశారు. ఈ సారి స్థానిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని హైకమాండ్‌‌‌‌ రామగుండంకే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. అన్ని జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా జిల్లా అధ్యక్షుడి పేరుతోపాటు ఇతర కార్యవర్గాల లిస్టులు హైకమాండ్​ చేతికి వెళ్తున్నాయి. అయితే పెద్దపల్లిలో మాత్రం హైకమాండే అన్ని చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.  ఈ నెల 15 తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం జరగనుండగా పెద్దపల్లి ఆశావహులు ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌లో మకాం వేశారు.
ఇంపార్టెన్స్​ ఎవరికో..
హైకమాండ్‌‌‌‌ ఎవరికి ఇంపార్టెన్స్​ ఇస్తుందో అనే ఆందోళన టీఆర్ఎస్‌‌‌‌లో పదవులు ఆశిస్తున్న వారిలో మొదలైంది. ఉద్యమకారులకా లేక పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్లకా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవి రేసులో పెద్దపల్లి జిల్లా నుంచి నల్ల మనోహర్​రెడ్డి,  రఘువీర్​సింగ్, కొంకటి లక్ష్మీనారాయణ ఉన్నారు.  టీఆర్ఎస్​ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడి రేసులో పెద్దపల్లి మున్సిపల్​ కౌన్సిలర్​ కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్​ ఉప్పు రాజ్​కుమార్​ ఉన్నారు. వీరిద్దరూ ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్నారు. జిల్లాలో పార్టీలతోపాటు కార్మికసంఘాల ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకునిపోయే వ్యక్తి అయితే బెటరని హైకమాండ్‌‌‌‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రఘువీర్‌‌‌‌‌‌‌‌సింగ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌గా ఉండగా, నల్ల మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌‌‌‌ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌‌‌‌ మేయర్‌‌‌‌‌‌‌‌గా పని చేసి న కొంకటి లక్ష్మీనారాయణకే ఎక్కువ అవకాశా లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మరోవారంలో అధ్యక్షుడు ఎవరనేది ఫైనల్‌‌‌‌ కావచ్చని తెలుస్తోంది.