
- 30 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
- సహాయక చర్యల్లో రోబోటిక్ మెషీన్ వినియోగం
బషీర్బాగ్, వెలుగు: అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. జాంబగ్ యాదవ సంఘం కార్యాలయ సమీపంలో ఉన్న సాగర్ కాంప్లెక్స్ మూడంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు , హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న తెలిపిన ప్రకారం... కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మాన్ సింగ్ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ షాపును, మొదటి అంతస్తులో గోదాంను నిర్వహిస్తున్నాడు. రెండు, మూడో అంతస్తుతో పాటు పెంట్ హౌస్ లో నివాస గృహాలున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4 :45 గంటల సమయంలో కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో గౌలిగూడా, యకత్ పురా ఫైర్ స్టేషన్ల నుంచి రెండు ఫైర్ ఇంజన్ లు ఘటనా స్థలానికి 10 నిమిషాల్లో చేరుకున్నాయి.
గోదాం నుంచి ఎగిసిపడుతున్న మంటలను పై అంతస్తులకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. మొదటి అంతస్తులోకి రోబోటిక్ ఫైర్ మిషన్ ను పంపించి మంటలను నిలువరించారు. 30 నిమిషాల్లో మొత్తం మంటలను అదుపు చేశారు. అనంతరం డీఆర్ఎఫ్ , ఫైర్ సిబ్బంది జంబో ల్యాడర్ సాయంతో పైఅంతస్తులో ఉన్న అపార్ట్మెంట్ వాసులను సురక్షితంగా కిందకు దించారు. అందులో ఉన్న పిల్లలను, వృద్ధులను భుజాన ఎత్తుకొని కిందకు తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.