జన్ జీలతోనే దేశ భవిష్యత్తు..వికసిత్ భారత్ లక్ష్యంలో యువతే కీలకం: మోదీ

జన్ జీలతోనే దేశ భవిష్యత్తు..వికసిత్ భారత్ లక్ష్యంలో యువతే కీలకం: మోదీ
  • ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తున్నరు
  • టెర్రరిజానికి వ్యతిరేకంగా సాహిబ్‌‌‌‌‌‌‌‌జాదెల పోరాటం మరువలేనిది 
  • రాష్ట్రీయ బాల్ పురస్కార్’ గ్రహీతలతో ప్రధాని 

న్యూఢిల్లీ: దేశ భవిష్యత్తును నిర్మించే బాధ్యత జన్ జీ, జన్ ఆల్ఫా పైనే ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ తరం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జెన్‌‌‌‌‌‌‌‌ జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నదని అన్నారు. 

నేటి యువత సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడేతత్వం అసాధారణమని కొనియాడారు. ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘రాష్ట్రీయ బాల్ పురస్కార్’ గ్రహీతలతో ముచ్చటించారు. వయసుకు మించి ధైర్యసాహసాలు, ప్రతిభను చాటిన బాలలను అభినందించారు. అనంతరం బాలలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. 

మీపై ఎంతో నమ్మకం ఉన్నది

‘‘మీరంతా జన్ జీ, జన్- ఆల్ఫా తరానికి చెందినవారు. మీ సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నేను గమనిస్తున్నాను. అందుకే మీపై నాకు ఎంతో నమ్మకం ఉంది. మతోన్మాదం, టెర్రరిజానికి వ్యతిరేకంగా సాహిబ్‌‌‌‌‌‌‌‌జాదెలు (సిక్కు మత గురువు గురు గోవింద్ సింగ్ కొడుకులు) చూపిన సాహసం, ధైర్యం ప్రపంచ చరిత్రలోనే అత్యున్నతమైనది. 

వారు అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అప్పట్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సాగించిన అరాచకాలను, బలవంతపు మత మార్పిడిలను వారు ఎదిరించారు. తల వంచడం కంటే మరణమే మిన్న అని నిరూపించారు. ఒకవైపు క్రూరత్వం, మరోవైపు విశ్వాసం ఉన్నప్పుడు.. ఆ విశ్వాసమే గెలుస్తుందని సాహిబ్‌‌‌‌‌‌‌‌జాదెల చరిత్ర మనకు నేర్పుతున్నది’’అని ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌‌‌‌‌‌‌‌ పురస్కార్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమానికి హాజరైన బాలలకు మోదీ సూచించారు. 

యువత కలలు కనాలి

సంస్కృత శ్లోకాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. ‘‘చిన్న పిల్లలు చెప్పే జ్ఞానాన్నైనా మనం స్వీకరించాలి. నేటి యువత తమ కలలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలి. గతంలో యువత కలలు కనడానికి కూడా భయపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన మానసిక బానిసత్వపు ఆలోచనలను వీడి.. భారతీయతపై గర్వపడాలి. పాపులారిటీ, ఆకర్షణలకు లోనుకావొద్దు”అని ప్రధాని మోదీ అన్నారు. 

సంతాలీ భాషలో రాజ్యాంగ ప్రతులు.. భేష్.. 

గిరిజన తెగలకు చెందిన సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ఆ వర్గాల ప్రజలకు తమ హక్కులు, విధులను తమ మాతృభాషలో అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. దేశ సంస్కృతి, భాషా వైవిధ్యాన్ని గౌరవించడంలో ఇది ఒక ముందడుగు అని కొనియాడారు. సంతాలీ అనేది ప్రధానంగా జార్ఖండ్, ఒడిశా, బెంగాల్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్ రాష్ట్రాల్లోని గిరిజన ప్రజలు మాట్లాడే భాష.

సంస్కరణలు ఆగవు

రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు జరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు ఆగిపోవని తెలిపారు. అవి మరింత వేగంగా సాగుతాయని స్పష్టం చేశారు. గత పదేండ్లలో చేపట్టిన సంస్కరణలు.. కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే కాలంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు ఉంటాయని చెప్పారు.  

మోదీ అధ్యక్షతన నేడు, రేపు  చీఫ్ సెక్రటరీల సదస్సు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శని, ఆదివారాల్లో ఢిల్లీలో రాష్ట్రాల చీఫ్​ సెక్రటరీల 5వ జాతీయ సదస్సు జరగనున్నది. ‘వికసిత్ భారత్ కోసం మానవ వనరులు’ థీమ్‌‌‌‌‌‌‌‌తో ఈ ఏడాది సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో బాల్య విద్య, పాఠశాల విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్య, క్రీడలు.. ఇతర కార్యకలాపాలు అనే ఐదు అంశాలపై  చర్చించనున్నారు. 

కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచడం, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనలో రాష్ట్రాల పాత్రను బలోపేతం చేయడం.. జనాభాను సంఖ్యగా కాకుండా, దేశాభివృద్ధికి ఉపయోగపడే మానవ వనరుగా మార్చడమే ఈ సదస్సు లక్ష్యం.