హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) యూనియన్లు అల్టిమేటం జారీ చేశాయి. గురువారం దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది డెలివరీ బాయ్స్ విధులను బహిష్కరించడంతో సగానికి పైగా సేవలు నిలిచిపోయాయని యూనియన్ నేత షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. ప్రాణాల మీదికి తెస్తున్న 10 నిమిషాల డెలివరీ విధానం రద్దు, అకారణంగా చేస్తున్న ఐడీల బ్లాకింగ్, తగ్గుతున్న ఆదాయాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టినట్లు వివరించారు.
కార్మికులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే కంపెనీలు పోలీసులతో బెదిరించడం, ఐడీలను బ్లాక్ చేయడం వంటి అణిచివేత చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిగ్ వర్కర్ల రక్షణకు చట్టాలు చేయాలని, న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే 31న సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సలావుద్దీన్ స్పష్టం చేశారు.
