
- ఓల్డ్‌సిటీలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో రిలీజ్
- పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో.. విద్యుత్ భద్రతా నిబంధనలను కఠినంగా పాటించాలని చీఫ్ఎలక్ట్రికల్ఇన్స్పెక్టరేట్ ప్రజలకు సూచించింది. హాస్పిటల్స్, మల్టీ స్టోరుడ్ బిల్డింగులు, బహుళ అంతస్థుల ఆపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర ప్రజా సౌకర్యాలకు నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. విద్యుత్ సురక్షిత వినియోగం కోసం విద్యుత్ చట్టం-2003, నియమ నిబంధనలు, అదనపు మార్గదర్శకాలను అనుసరించాలని విద్యుత్ ఇన్‌స్పెక్టరేట్ స్పష్టం చేసింది. ఈ సంస్థల నిర్వాహకులు ఎలక్ట్రికల్ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్లు ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని, లేనట్టయితే విద్యుత్ చట్టం-2003 ప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
ప్రజల భద్రత కోసం ముఖ్యమైన మార్గదర్శకాలు ఇవే..
- విద్యుత్ పనులన్నీ లైసెన్స్ పొందిన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు, అనుమతి కలిగిన వారి పర్యవేక్షణలో, నైపుణ్యం కలిగిన వైర్‌మెన్‌ల ద్వారా జరగాలి.
- లైటింగ్ సర్క్యూట్‌లకు 30ఎంఏ ఈఎల్సీబీ/ఆర్సీసీబీ, పవర్ సర్క్యూట్‌లకు 100ఎంఏ ఈఎల్సీబీ అమర్చాలి.
- విద్యుత్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్-2023, నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్-2023, నేషనల్ బిల్డింగ్ కోడ్-2016, ఐఎస్/ఐఈసీ ప్రమాణాలకు లోబడి ఉండాలి.
- లైటింగ్‌కు 1.5 స్క్వేర్ మిల్లీమీటర్, పవర్ పాయింట్లకు 2.5 స్క్వేర్ మిల్లీమీటర్, ఏసీ యూనిట్లకు 4 స్క్వేర్ మిల్లీమీటర్ ఉండే సరైన కేబుల్ సైజులను వాడాలి.
- వోల్టేజ్ హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లో స్టెబిలైజర్లను ఉపయోగించాలి.
- ఫైనల్ సబ్-సర్క్యూట్‌లు 10 పాయింట్లు లేదా 800 డబ్ల్యూ కంటే తక్కువగా ఉండాలి.
- ఓవర్‌హీటింగ్ నివారణకు లోడ్‌ను సమతుల్యం చేయాలి.
- హార్మోనిక్స్ ఉన్నచోట ఫిల్టర్లను అమర్చి, హై పవర్ ఫ్యాక్టర్‌ను నిర్వహించాలి.
- ఒకే స్విచ్‌బోర్డ్‌కు బహుళ ఫేజ్‌లను కనెక్ట్ చేయకూడదు.
- అత్యవసర సమయాల్లో సరఫరా నిలిపివేయడానికి ఐసోలేషన్ స్విచ్‌లను అందుబాటులో ఉంచాలి.
- అదనంగా, ఆస్పత్రుల్లో ఐటీ సిస్టమ్ ఎర్తింగ్, మెడికల్ ఐసోలేషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్సులేషన్ మానిటరింగ్ సిస్టమ్‌లను వాడాలని, ఆర్సీసీబీలు, ఎంసీబీలను క్రమం తప్పకుండా పరీక్షించాలని సూచించారు. సర్జ్ ప్రొటెక్షన్ డివైజ్‌లు, ఫైర్-రేటెడ్ సీలెంట్లు, మండే పదార్థాలకు దూరంగా స్విచ్‌బోర్డ్‌లను ఉంచాలని, 15 ఏండ్లు దాటిన వైర్లను తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయడం వంటి మార్గదర్శకాలను జారీ చేసింది. చీఫ్ ఎలక్ట్రికల్ఇన్స్పెక్టర్ కు అన్ని వర్గాలు సహకరించి, ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఒక ప్రకటనలో కోరారు.