హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వెన్న జగదీశ్వర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా చల్లా జయ నాగ సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం నాంపల్లిలోని విద్యాభవన్ లో బోర్డు ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే రెండేండ్ల కాలానికిగాను యూనియన్ కొత్త బాడీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోట మురళీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చంద్రమౌళి, ట్రెజరర్ గా వంశీ కృష్ణ, మహిళా రిప్రజెంటేటివ్ గా స్వప్న జోషి, స్పోర్ట్స్ సెక్రటరీగా ఎల్పుల మధు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బోర్డు ఉద్యోగులకు పెండింగ్ ప్రమోషన్లను ఒకటీ, రెండు నెలల్లోనే ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు హెల్త్ కార్డుల విషయమై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంలో ఐక్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులుగా సంయుక్త కార్యదర్శి భీమ్ సింగ్, మోహన్, బాబురావు, సంజయ్ కుమార్‌లు వ్యవహరించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు, డీఐఈఓ ఆఫీసు ఉద్యోగులు పాల్గొన్నారు.
