చండ్రుపట్లలో వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

చండ్రుపట్లలో వీధి కుక్కల దాడిలో 14 గొర్రెలు మృతి

కల్లూరు, వెలుగు: వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతిచెందిన ఘటన కల్లూరు మండల పరిధిలోని చండ్రుపట్లలో శనివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జోనబోయిన కృష్ణయ్యకు చెందిన గొర్రెలను శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలోని కొట్టంలో ఉంచాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీధి కుక్కలు కొట్టంలోకి దూరి గొర్రెలపై దాడి చేశాయి. చప్పుడు విన్న కృష్ణయ్య కుక్కలను తరిమేశాడు. 

కుక్కల దాడిలో 14 గొర్రెలు చనిపోగా, ఆరింటికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్​ పులి సాంబశివుడు, సర్పంచ్ కాటమనేని విజయలక్ష్మి, కాటమనేని వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన గొర్రెలకు చికిత్స అందించేందుకు వెటర్నరీ డాక్టర్​ను పిలిపించి మూగజీవాలకు వైద్యం చేయించారు. ప్రభుత్వం కృష్ణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. వారివెంట ఉపసర్పంచ్ పైళ్ల రాధాకృష్ణ, వల్లభనేని రవికుమార్, గొర్రెల, మేకల సంఘం మండల కమిటీ కార్యదర్శి బట్టు నరసింహారావు తదితరులు ఉన్నారు.