- ఒకే గుర్తుపై ఎన్నికల్లో పోటీ చెయ్యాలి: పల్లా వెంకట రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆర్థిక, రాజకీయ అరాచకాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు ఏకమై పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. ఎర్ర జెండాలన్నీ ఒకే గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తేనే ప్రజలు కమ్యూనిస్టులను ప్రత్యామ్నాయంగా చూస్తారన్నారు. సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా శనివారం హైదరాబాద్లోని నారాయణగూడలో “వందే ళ్ల సీపీఐ త్యాగాల, విజయాల స్ఫూర్తి సభ” నిర్వహించారు.
దీనికి పల్లా వెంకట రెడ్డి హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కొనసాగితే కార్మిక, రైతు, యువత వ్యతిరేక చర్యలు మరింత ఉధృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్యం, హైదరాబాద్ విలీనంలో కమ్యూనిస్టుల పాత్రను బీజేపీ ప్రభుత్వం వక్రీకరిస్తోందని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నర్సింహ మాట్లాడుతూ.. బీజేపీ, ఎంఐఎంకు పోరాట చరిత్ర లేదని విమర్శించారు. మోదీ అబద్ధాలను, ఒవైసీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. సభకు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అధ్యక్షత వహించగా.. వీఎస్ బోస్, ఎస్ చాయాదేవి, ఏ రవీంద్రచారి, డాక్టర్ బీవీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
