పంట కొనుగోళ్ల నుంచి కేంద్రం పక్కకు!

పంట కొనుగోళ్ల నుంచి కేంద్రం పక్కకు!
  • మద్దతు ధర ప్రకటనతోనే సరి
  • సోయా, మక్కలు, కందులు, పెసలు.. క్రాప్ ఏదైనా తిరకాసే 
  • పంట కొనుగోళ్లపై చేతులెత్తేస్తున్న కేంద్రం 
  • ఏటా రూ. వేల కోట్ల భారం రాష్ట్రంపైనే

హైదరాబాద్, వెలుగు:  పంటలకు కనీస మద్దతు ధర(ఎమ్‌‌ఎస్‌‌పీ) ప్రకటించి, కొనుగోళ్ల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. దీంతో వివిధ పంటల కొనుగోళ్ల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోంది. సోయాబీన్, మొక్కజొన్న(మక్కలు), జొన్న, కందులు, పెసలు, మినుముల వంటి పంటల సేకరణలో కేంద్రం పరిమితులు విధిస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్‌‌ఎస్) కింద కొన్ని పంటలకు మాత్రమే అనుమతులు ఇస్తున్న కేంద్రం, మిగతా పంటలను రాష్ట్రమే కొనాల్సి వస్తోంది. 

దీంతో రాష్ట్ర బడ్జెట్‌‌పై పెద్ద ఎత్తున భారం పడుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గత వానాకాలం సీజన్‌‌లో మొక్కజొన్న పంట సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఈ భారం మొత్తం రాష్ట్రంపైనే పడింది. అదేవిధంగా, గత యాసంగి సీజన్‌‌లో జొన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్రం రూ.520 కోట్లు ఖర్చు చేసి సేకరించింది. ప్రతి సంవత్సరం మొక్కజొన్న, జొన్న పంటల సేకరణకు రాష్ట్ర ఖజానాపై సుమారు రూ.3,000 కోట్ల భారం పడుతున్నట్లు అంచనా. ‘‘ఈ పంటలను పీఎస్‌‌ఎస్ లో చేర్చకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కేంద్రం ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి’’ అని రాష్ట్ర సర్కారు కోరుతోంది. 

ప్రతి పంటలోనూ కఠిన నిబంధనలు  

ప్రస్తుతం రాష్ట్రంలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా సేకరిస్తున్న పత్తి పంటకు కూడా కేంద్రం కఠిన నిబంధనలు విధిస్తోంది. తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండాలని, ఎకరానికి కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే కొనాలని చెప్తోంది. దీంతో రైతులు తమ మిగతా పంటను మార్కెట్‌‌లో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. జిన్నింగ్ మిల్లులు కొనుగోళ్లు నిలిపివేసి ఆందోళనలు చేస్తే కానీ పంట సేకరణలో కొంత సడలింపులు చేయలేదు. ధాన్యం కొనుగోళ్లలోనూ కేంద్రం భారీగా పరిమితులు విధిస్తోంది. 

మొత్తంగా, కేంద్రం పంటల దిగుబడిలో కొంతమేరకు మాత్రమే సేకరించేందుకు అనుమతి ఇస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మరిన్ని ప్రతిపాదనలు పంపించినా ఫలితం ఉండడం లేదు. దీంతో చేసేది లేక రాష్ట్రమే ఆ భారాన్ని మోస్తూ నెట్టుకొస్తోంది. కేంద్రం రైతుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 

పరిమితులతో ఇబ్బందులు 

సోయాబీన్, కంది వంటి పంటకు కేంద్రం కేవలం 25 శాతం సేకరణకు మాత్రమే అనుమతి ఇస్తోంది. మిగతా పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెసర (పెసలు), మినుములు, సోయాబీన్ పంటలను పీఎస్‌‌ఎస్ కింద మద్దతు ధరకు సేకరించేందుకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపించింది. పెసర, మినుములు పంటలకు100 శాతం, సోయాబీన్‌‌కు 50 శాతం సేకరణకు అనుమతులు ఇవ్వాలని కోరింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయంపై వినతిపత్రం అందజేశారు.

 "కేంద్రం అన్ని పంటలకు ఎమ్‌‌ఎస్‌‌పీ ప్రకటించినా, సేకరణకు అనుమతులు ఇవ్వకపోవడం రైతులకు అన్యాయం జరుగుతోంది. మొక్కజొన్న, జొన్న వంటి పంటలను పీఎస్‌‌ఎస్ స్కీమ్‌‌లో చేర్చి, కనీసం 50 శాతం సేకరణకు అనుమతి ఇవ్వాలి’’ అని మంత్రి తుమ్మల కోరారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినా, ఇప్పటి వరకు సానుకూల స్పందన లేదని సమాచారం.