- నల్గొండలో అత్యధికంగా.. భద్రాద్రిలో గిరిజన మహిళల ప్రభంజనం
- వందల సంఖ్యలో ఎన్నికైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రతినిధులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ సమరంలో మహిళా లోకం విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు గాను మహిళలకు రిజర్వేషన్ల ద్వారానే ఏకంగా 5,878 స్థానాలు దక్కాయి. రిజర్వేషన్ల ప్రకారమే కాకుండా, జనరల్ స్థానాల్లోనూ తమ సత్తా చాటుతూ గ్రామీణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, అందులో జిల్లాల నుంచి 12,495 పంచాయతీలకు సంబంధించిన వివరాలు అందాయి.
దీని ప్రకారం జనరల్ (అన్రిజర్వ్డ్) మహిళా కోటాలో 2,446 స్థానాలు, బీసీ మహిళలకు 942, ఎస్సీ మహిళలకు 908, ఎస్టీ మహిళలకు 1,434 స్థానాలు కేటాయించడంతో పల్లెల్లో ‘నారీ’ గర్జన స్పష్టంగా కనిపించింది . ఓపెన్ కేటగిరీలోనూ మహిళలు పోటీ చేసే అవకాశం ఉండటంతో సగానికి పైగా పంచాయతీల్లో మహిళల పాలన సాగనుంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహిళలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. 866 పంచాయతీలు ఉన్న నల్గొండలో బీసీ మహిళలకు 61, ఎస్సీ మహిళలకు 69, ఎస్టీ మహిళలకు 86, జనరల్ మహిళలకు 185 చొప్పున మొత్తం 401 స్థానాల్లో గెలిచారు. సంగారెడ్డి జిల్లాలో 595 పంచాయతీలకు గాను పెద్ద సంఖ్యలో గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన మహిళల ప్రభంజనం కనిపించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పంచాయతీల్లో ఆదివాసీ మహిళలు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
ఈ జిల్లాలో మొత్తం 468 పంచాయతీలు ఉండగా, అందులో దాదాపు సగం అంటే ఏకంగా 225 స్థానాలు ఎస్టీ (ఎస్టీ) మహిళ సర్పంచ్‌లు ఉన్నారు. ఇదే బాటలో ఆదిలాబాద్‌లో 142, మహబూబాబాద్‌లో 140, ములుగులో 47 స్థానాలు ఎస్టీ మహిళలకు దక్కాయి. 12,495 పంచాయతీల్లో బీసీ మహిళలు 942 మంది, ఎస్సీ మహిళలు 908 మంది, ఎస్టీ మహిళలు 1,434 మంది సర్పంచ్ పీఠాన్ని అధిష్టిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ బీసీ, ఎస్సీ మహిళలు పెద్ద సంఖ్యలో గెలిచారు.
